హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్‌ను పట్టపగలే నెంబర్ ప్లేట్ లేని వాహనంతో ఢీకొట్టి చంపడంపై మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి శాంతిభద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని అన్నారు.
క్యాబినెట్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ పక్కకు పోయినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, గతంలో ఎప్పుడూ లేనంత వడగాల్పుతో రైతులకు వడదెబ్బ తగిలి మరణిస్తున్నారని ఉత్తర తెలంగాణ మంత్రి ఒకరు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. 80శాతం ధాన్యం కొనుగోలు చేశామని, మరో 20శాతం ధాన్యమే కల్లాల్లో ఉన్నాయని సహచర మంత్రి ఇచ్చిన సమాధానంపై మంత్రివర్గం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.