e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ట్రెండింగ్‌ ఎమ్మెల్యేలదే బాధ్యత

ఎమ్మెల్యేలదే బాధ్యత


ప్రతి ఓటరునూ కలవాలి.. గెలిచి తీరాలి
ఏ మాత్రం ఏమరుపాటు వద్దు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లా చేయకండి
ఎమ్మెల్సీ ఎన్నికలను అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
ప్రత్యర్థులకు దీటుగా జవాబివ్వాలి
టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిర్దేశం

ఎమ్మెల్యేలదే బాధ్యత


హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని, ఇందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి సత్తా చాటాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణభవన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నేతలతో, ప్రగతిభవన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సరైన కార్యాచరణ లేకపోవటంవల్ల తక్కువ ఫలితాలొచ్చాయి. ఈసారి అది పునరావృతం కాకూడదు’ అని సున్నితంగానే మందలించినట్టు తెలుస్తున్నది. ‘లోపం ఎక్కడున్నదో ఎవరికివారే గ్రహించుకోవాలి. అనువైన కార్యాచరణ అమలు చేసుకోవాలి. ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, ఉప్పల్‌, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయాం. దీనిపై లోతుగా విశ్లేషణ జరగాలి. ఇది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే. పార్టీ కోసం పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. నేను కూడా తిరుగుతా.. మీరూ తిరగాలి. మన ఎన్నికే అన్నట్టు తిరగాలి’ అని కేటీఆర్‌ చెప్పినట్టు తెలిసింది. ‘హైదరాబాద్‌’ స్థానానికి అభ్యర్థిగా వాణీదేవిని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తర్వాత అనేకవర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వస్తున్నదని, ప్రత్యర్థులు సైతం గందరగోళంలో పడ్డారని పేర్కొన్నారు. ఇతర అభ్యర్థుల కంటే వాణీదేవికి ఉన్న అర్హతలు, ఆమె వ్యక్తిత్వం వెయ్యిరెట్లు మేలు అనే విషయాన్ని సమర్థంగా విద్యావంతుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ‘సమయం తక్కువ ఉన్నది. ప్రతీ నియోజకవర్గానికి అభ్యర్థి రాలేకపోవచ్చు. అంతమాత్రాన ‘నాకేం సంబంధం?’ అని కాకుండా ‘ఆమె గెలుపులో నేనుండాలి’ అనే పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేయాలి’ అని నొక్కి చెప్పినట్టు తెలిసింది.
దుష్ప్రచారాలను తిప్పికొట్టండి
పార్టీపై, ప్రభుత్వంపై కుట్రపూరితంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ బలంగా, ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో న్యూనతాభావంతో ఉండకూడదని, బాగా హోం వర్క్‌ చేసి టీవీ చర్చల్లో పాల్గొనాలని సూచించారు. సోషల్‌ మీడియాలో పార్టీ వాణిని బలంగా వినిపించాలన్నారు. ప్రత్యర్థి పార్టీలు, సమాజంలో కొన్ని వర్గాలు మాజీ ప్రధాని కుమార్తెను రాజ్యసభకు, లేదా మండలికి గౌరవంగా పంపొచ్చుకదా! అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. ‘పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కుటుంబాన్ని గౌరవించాలని మేము అభ్యర్థిగా నిలబెట్టాం. తద్వారా పీవీకి ఘనమైన నివాళి అర్పించాలని టీఆర్‌ఎస్‌ భావించింది. పీవీ కుటుంబానికి గౌరవమివ్వాలనే ఆలోచన మీకూ ఉంటే వాణీదేవిని ఏకగ్రీవం చేయాలని ప్రతిపక్షాలను డిమాండ్‌ చేయండి’ అని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆయా సమా వేశాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితరెడ్డి, మహమూద్‌ అలీ, చామ కూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్‌, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌, కార్పొరేటర్‌ బాబా ఫసియొద్దీన్‌, కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

27న ఏకకాలంలో సన్నాహక సమావేశాలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం చాలా పెద్దదని, అన్ని స్థాయిల పార్టీ శ్రేణులను రంగంలో దింపాలంటే ఏకరూప కార్యాచరణ ఉండాలని కేటీఆర్‌ సూచించారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఈ మూడు జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రచారం ప్రారంభించాలని ఆదేశించారు. ఎవరి కార్యాచరణ ఎలా ఉంది? ఏ నియోజకవర్గంలో ఎటువంటి ఫలితాలొచ్చాయి? అనేది పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని దృష్టిలో పెట్టుకొని అంతా కష్టపడి పనిచేయాలని హితబోధ చేసినట్టు తెలుస్తున్నది.

Advertisement
ఎమ్మెల్యేలదే బాధ్యత
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement