హైదరాబాద్ : దసరా పండుగకు ముందే సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సంస్థ లాభాల్లోంచి 30వాటాను అందజేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
2020లో సంస్థ లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు దసరా కానుకగా ఇవ్వగా.. 2021లో దానిని 29 శాతానికి పెంచారు. తాజాగా ఈ ఏడాది లాభాల్లో కార్మికుల వాటాను 30 శాతానికి పెంచారు. 2021 -22 సంవత్సరానికి గాను సింగరేణి కాలరీస్ సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పండుగ వేళ బోనస్ ప్రకటించడం కార్మికుల జీవితాల్లో ఆనందం నింపటమే అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువు అయిందన్నారు.