రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆదుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. అతనికి జోడీ కలిసిన తిలక్ వర్మ (61) స్వేచ్ఛగా ఆడేందుకు ఇషాన్ సహకరించాడు.
అయితే 13వ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కిషన్.. సైనికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇషాన్ చక్కని ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆ తర్వాత పదిహేనో ఓవర్లో బంతి అందుకున్న వెటరన్ అశ్విన్.. తిలక్ వర్మను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన స్లో బాల్‌ను స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన తిలక్ వర్మ.. మిస్ అయ్యాడు. దాంతో ఆ బంతి వికెట్లను కూల్చింది.
తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అభిమానులు చప్పట్లతో ముగింపు పలికారు. మరుసటి ఓవర్ తొలి బంతికే చాహల్.. టిమ్ డేవిడ్(1)ను బోల్తా కొట్టించాడు. చాహల్ వేసిన లెగ్ బ్రేక్ బంతిని డిఫెండ్ చేసుకోవడానికి డేవిడ్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాట్ తప్పించుకన్న బంతి ప్యాడ్లను తాకింది. అంపైర్ అవుట్ ఇవ్వడంతో డేవిడ్ రివ్యూ కోరాడు. రివ్యూలో కూడా అవుటని తేలడంతో నిరాశగా వెనుతిరిగాడు. 15.1 ఓవర్లలో ముంబై జట్టు 136 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.