న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టైటిల్ ఆశిస్తున్న పురుషుల రెండో సీడ్ రాఫెల్ నాదల్, మహిళల టాప్ సీడ్ ఇగా స్వియాటెక్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. నాదల్ ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌పై, స్వియాటెక్ అమెరికా క్రీడాకారిణి లారెన్ డేవిస్‌పై వరుస సెట్లలో గెలుపొందారు. గాస్కెట్‌పై నాదల్‌కిది 18వ విజయం కాగా, స్వియాటెక్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా రెండో యేడాది రౌండ్-16కు చేరుకున్నది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఆదివారం నాదల్ 6-0, 6-1, 7-5తో గాస్కెట్‌ను చిత్తుగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో తేలికగా తలొగ్గిన గాస్కెట్ మూడో సెట్లో కొంత ప్రతిఘటించాడు. అయినా గాస్కెట్కు నాదల్ చేతిలో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో ముఖాముఖి పోరులో నాదల్ 18-0 గెలుపోటముల ఆధిక్యం సాధించాడు.
గాస్కెట్‌తో పోరులో నాదల్ వరుసగా తొమ్మిది గేమ్‌లు గెలుచుకుని 6-0, 3-0తో ఆధిక్యంలో నిలిచాడు. పదో గేమ్‌లో సర్వీసు నిలుపుకున్న గాస్కెట్ మ్యాచ్‌ను గెలిచినంత ఆనందం పొందాడు. ఆ తరువాత నాదల్ వరుసగా అయిదు గేమ్‌లు గెలుచుకని రెండు సెట్లు సొంతం చేసుకుని మూడో సెట్లో 3-0 ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో గాస్కెట్ తేరుకుని పోటీఇచ్చాడు. అయినా నాదల్ గెలుపు ఊహించిన విధంగా సాగి 7-5 మూడోసెట్తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నాదల్ ప్రిక్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫొను ఢీకొంటాడు. టియాఫొ 7-6 (7), 6-4, 6-4తో 14వ సీడ్ డీగొ స్వార్జ్మన్పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ రెండో సెట్లో వెనుకంజలో ఉన్నా పుంజుకుని 6-3, 6-4తో లారెన్ డేవిస్‌పై విజయం నమోదు చేసుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ ఒక పదునైన వైడ్ షాట్‌తో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలో డేవిస్ పుంజుకుని 4-1 ఆధిక్యం సాధించినా, స్వియాటెక్ పోరాడి స్కోరు సమం చేసింది. ఆపై వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని విజయనాదం చేసింది. స్వియాటెక్ తదుపరి మ్యాచ్‌లో నీమియర్ను ఢీకొంటుంది. నీమియర్ 6-4, 7-6 (7/5)తో చైనాకు చెందిన క్విన్వెన్ను ఓడించింది.