e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News జనగామలో మెగా లెదర్‌ పార్కు

జనగామలో మెగా లెదర్‌ పార్కు

  • మరో 6 జిల్లాల్లో మినీ లెదర్‌ పార్కులకు సన్నాహాలు
  • చెన్నైలోని కేంద్ర చర్మ పరిశోధనా సంస్థతో ఒప్పందం
  • త్వరలో ఆర్మూర్‌ లెదర్‌ క్లస్టర్‌ నిర్మాణ పనులు ప్రారంభం
  • తోళ్ల పరిశ్రమకు కేంద్రంగా మారనున్న తెలంగాణ

తెలంగాణ తోళ్ల పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం జనగామలో 120 ఎకరాల్లో మెగా లెదర్‌ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించాలని ఇటీవలే పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. మరో ఆరు జిల్లాల్లో మినీ లెదర్‌ పార్కులతోపాటు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో లెదర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా లెదర్‌ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జనగామలో మెగా లెదర్‌పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 120 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ చర్మాన్ని శుద్ధి చేయడం మొదలు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే కర్మాగారాల వరకు అన్నీ ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన డీపీఆర్‌ రూపొందించాలని ఇటీవల మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌ తయారీకి త్వరలోనే ఏజెన్సీని నియమించనున్నారు. ఇక ఆరు జిల్లాల్లో మినీ లెదర్‌ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాల వరకు భూమి కేటాయించింది. స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఎల్‌ఐపీసీ), చెన్నైలోని సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ)తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. ఈ 6 మినీ లెదర్‌ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశ, విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు, బహుళజాతి సంస్థలు కర్మాగారాలు ఏర్పాటుచేసే అవకాశమున్నదని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

త్వరలో ఆర్మూర్‌ లెదర్‌ క్లస్టర్‌ పనులు
కేంద్ర ప్రభుత్వ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో లెదర్‌ క్లస్టర్‌ ప్రాజెక్టును చేపట్టారు. 28 ఎకరాల్లో రూ.10 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రూ.2.61 కోట్లు విడుదల చేయగా, కేంద్రం కూడా ఇటీవల రూ.2 కోట్లు విడుదల చేసింది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు సరఫరా, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుతోపాటు ముడిసరుకు, నైపుణ్య శిక్షణా సంస్థ నిర్మాణం తదితర సదుపాయాలు కల్పించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న లెదర్‌ క్లష్టర్‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రి కేటీఆర్‌ చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది.

మినీ లెదర్‌ పార్కులు ఏర్పాటుచేయనున్న ప్రాంతాలు

  1. పోలేపల్లి (మహబూబ్‌నగర్‌)
  2. దండేపల్లి (నల్లగొండ)
  3. మందమర్రి (మంచిర్యాల)
  4. జింకుంట (నాగర్‌కర్నూల్‌)
  5. రుక్మాపూర్‌ (కరీంనగర్‌)
  6. మల్లెమడుగు (ఖమ్మం)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement