పిజ్జా.. గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్, ఆలివ్స్, చీజ్, స్పైసెస్ టాపింగ్‌తో లభిస్తుందనే మనకు తెలుసు. కానీ బుజ్జి కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ.. ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు దీన్ని. కొందరు బొగ్గులపై కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్, పనీర్, కూరగాయల ముక్కలు, చీజ్ వేసి పైనుంచి ఆలివ్స్, డబుల్ చీజ్ లేయర్ వేసి స్మోక్డ్ ఫ్లేవర్‌తో వడ్డిస్తే.. మరికొందరు పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఒవెన్‌లో చేస్తూ పిజ్జా ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ కుండ పిజ్జాను నోరంతా తెరిచి తినక్కర్లేదు. ఎంచక్కా చెంచాతోనే లాగించేయొచ్చు.
ఏం కావాలి?
బ్రొకోలి ముక్కలు: ఒక కప్పు, పచ్చి బఠాణీలు: అర కప్పు, ఆలుగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, చీజ్ తురుము: పావుకప్పు, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, కార్న్ ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం: ఒక టీస్పూన్.
ఎలా వండాలి?
బ్రొకోలి ముక్కలు, ఆలుగడ్డ, పచ్చి బఠాణీలను వేడినీటిలో ఐదు నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తురుము, ఉడికించిన బ్రొకోలి, ఆలుగడ్డ, పచ్చి బఠాణీలు, చీజ్ తురుము, ఉప్పు వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక బ్రొకోలి మిశ్రమం జోడించి సన్నటి మంటపై ఐదు నిమిషాలపాటు వేయించాలి. చల్లారాక కార్న్ ఫ్లోర్, నిమ్మరసం కలపాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి బ్రొకోలి మిశ్రమాన్ని పాటీల్లా చేసుకుని రెండు వైపులా ఓ మోస్తరు ఫ్రై చేసుకుంటే ఆరోగ్యకరమైన బ్రొకోలి పీస్ పాటీస్ రెడీ.
అవకాడోను తెలుగులో ‘వెన్నపండు’ అంటారు. మెక్సికో దీని పుట్టిల్లు. దాదాపు 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దీని గుజ్జు అచ్చంగా ఆవు వెన్నను పోలి ఉంటుంది. కాస్త చేదుగా ఉన్నా పోషకాలు అపారం. పండ్ల జాతికి చెందిందే అయినా ఎక్కువగా చికెన్, ఫిష్, మటన్, శాండ్విచ్, సలాడ్లలో వాడతారు. కొన్ని ప్రాంతాల్లో ఐస్‌క్రీం, డెసర్ట్, జ్యూస్‌లలోనూ వినియోగిస్తారు. అవకాడోలు ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభిస్తాయి. వీటిలో అధికశాతం కొవ్వుతోపాటు పొటాషియం ఉంటుంది. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్, మధుమేహ కారకాలను నియంత్రించవచ్చు. అవకాడోలో ఫోలిక్ ఆమ్లం పుష్కలం. అందువల్ల గర్భిణులకు మరీ మంచిది. పుట్టబోయే పిల్లల్లో నాడీ సంబంధ సమస్యలను నిరోధించవచ్చు. అవకాడో బరువు తగ్గేందుకూ సాయపడుతుంది. వీటి గింజలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు.
నాలుగు పదులు దాటినా నాజూకు నడుముతో కుర్రకారు మనసు దోచేస్తున్న నటీమణుల్లో శిల్పాశెట్టి ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. అందంలో కొత్తతరం నాయికలతో పోటీపడుతుంది. రోజువారీ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకునే ఈ బాలీవుడ్ భామ ఆ సంగతులన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ‘శిల్పాశెట్టికుంద్రా’ పేరున ఓ యూట్యూబ్ చానల్ పెట్టి ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో నేర్పుతున్నది. తనే స్వయంగా చేసి చూపిస్తుంది కూడా. పాతిక లక్షల సబ్‌స్ర్కైబర్స్‌తో దూసుకుపోతున్న ఈ చానల్లో ఆహార నియమాలు, ఆరోగ్య రహస్యాలకు సంబంధించిన సమాచారం అపారం. మన ఆహార సంప్రదాయంపై ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ పేరుతో ఓ పుస్తకం రాసింది శిల్ప.
క్యాబేజీ ఘాటును చాలామంది ఇష్టపడరు. ఆ కారణంగానే పళ్లెంలోనూ పక్కన పెడతారు. అయితే చిన్న చిట్కాతో క్యాబేజీ వాసనను పోగొట్టొచ్చు. క్యాబేజీని ఉడకబెట్టేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే కూర వాసన రాదు.
కూరలు రుచిగా ఉంటేనే కడుపు నిండుతుంది. వండినవారికి తృప్తి, తిన్నవారికి సంతృప్తి. మరి, రుచి కుదరాలంటే ఏం చేయాలి? ..
♦ ఉప్పు, కారం, పులుపు వంటివి తగిన మోతాదులో ఉండాలి. అందుకని కూర వండేటప్పుడే సరైన కొలతల్లో ఉప్పు, కారం సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల తొందరలోనో, ఒత్తిడి వల్లో ఎక్కువ తక్కువ వేసే ఆస్కారం ఉండదు. మరిచిపోయే అవకాశమే లేదు.
♦ కూర చివరగా ఏ రంగులో రావాలనేది మొదట మనం నూనెలో వేసే కారం, పసుపు, మసాలా వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కూర ఎర్రగా రావాలనుకుంటే కారం, పచ్చగా రావాలంటే పసుపు నూనెలో వేసుకుంటే సరి.
♦ ఉల్లిపాయలు తరిగే విధానంపైనా కూర రుచి ఆధారపడి ఉంటుంది. గ్రేవీల్లాంటివి వండేటప్పుడు సన్నగా తరిగిన ముక్కల్ని, సాధారణ కూరల్లో చిన్నగా కోసిన ముక్కల్ని వాడుకోవాలి.
♦ పలుచటి కూరలు వండేటప్పుడు మసాలా దినుసుల్ని కాస్త తక్కువగానూ, చిక్కటి గ్రేవీలు చేసేటప్పుడు కాస్త ఎక్కువగానూ వేయించుకోవాలి.
♦ పచ్చివి, మామూలుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలకంటే ముదురు గోధుమ రంగులో వేయించిన ముక్కలు రుచితోపాటు కూరకు రంగును ఇస్తాయి.
♦ చేపలు వండేటప్పుడు కాస్త పలుచగా, మసాలాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. మసాలా ఎక్కువైతే చేపల అసలు రుచి పోయి, మసాలా రుచే మిగులుతుంది.
♦ వండిన కూరలను మళ్లీమళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే రుచి మారే అవకాశం ఉంది.
buffet | బఫేలో ఏం తినాలి? ఎలాంటి టిప్స్ పాటిస్తే మంచిది?
RRR | ట్రిపుల్ ఆర్ కుకింగ్ గురించి తెలుసా? దీనివల్ల లాభమేంటి?
Kitchen Tips | స్వచ్ఛమైన తేనె ఎన్ని రోజులకు పాడవుతుందో తెలుసా