Maruti `Grand Vitara` | మార్కెట్లో తన పట్టు కాపాడుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పాత మోడల్ కార్లను న్యూ డిజైన్లతో కస్టమర్ల ముందుకొస్తున్నది. ఈ దశలో ప్రీమియం ఎస్యూవీ గ్రాండ్ విటారా కారు బుకింగ్స్ సోమవారం ప్రారంభించింది. ఈ నెల 20న దేశీయ మార్కెట్లోకి మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎంటర్ కానున్నది. ఆసక్తిగల కస్టమర్లు నెక్సా షోరూమ్ల వద్ద గానీ, మారుతి సుజుకి వెబ్సైట్లో లాగిన్ అయి కానీ రూ.11 వేలు చెల్లించి గ్రాండ్ విటారా కారును బుక్ చేసుకోవచ్చు.
మారుతి గ్రాండ్ విటారా ఇప్పటికే మార్కెట్లో ఉన్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్తో ఢీకొట్టనున్నది. ఇంకా హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్లతోనూ పోటీ పడనున్నది. ఇంతకుముందు విటారా బ్రెజా మోడల్ కారును కొత్తగా `బ్రెజా (Brezza)` పేరుతో ఇటీవలే లాంచ్ చేసింది మారుతి సుజుకి. దీని ధర రూ.7.99 లక్షలు.
గ్రాండ్ విటారా మోడల్ కారు ధర రూ.10-11 లక్షల నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో గ్రాండ్ విటారా కార్ల ఉత్పత్తిని మారుతి సుజుకి ప్రారంభించనున్నది. టయోటా వారి హైరైడర్ మాదిరిగానే మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సామర్థ్యం గల 1.5 లీటర్ల మైల్డ్-హైబ్రీడ్ ఇంజిన్తో గ్రాండ్ విటారా తయారు చేస్తారు. దీన్ని కర్ణాటకలోని బిదాడీ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తారు.
హైరైడర్లో మాదిరిగానే 2022 గ్రాండ్ విటారా ఎస్యూవీ కారులోనూ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. న్యూ ఎక్స్టీరియర్ షేర్, స్పోర్ట్ ఎక్స్టీరియర్ లుక్ కలిగి ఉంటుంది. 9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా, హెడ్స్ అప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ చార్జర్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, లెథరెట్టే అప్హోల్స్టరీ తదితర ఫీచర్లు ఉండొచ్చునని భావిస్తున్నారు.