హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను ప్రత్యక్షంగా కలిసి.. వారి సమస్యలు వింటానని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు గణపతి విదేశాల్లో లేడని, ఆయన ఇండియాలోనే ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని తెలిపారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సలైదా అతని భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్ పూ నమ్ అలియాస్ జోబాలు డీజీపీ ఎదుట లొంగిపోయారు.
ఈ ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీవ్రనష్టమని, తూర్పు ప్రాంతీయ బ్యూరో (ఈఆర్బీ) వ్యవస్థ దాదాపు కుప్పకూలే పరిస్థితికి చేరుకుందని డీజీపీ తెలిపారు. నరహరి దంపతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన 64 ఏళ్ల పసునూరి నరహరి 1982లో పీపుల్స్ వార్‌లో చేరి అజ్ఞాత జీవితం ప్రారంభించాడని తెలిపారు.
ఆయుధ తయారీ, రాకెట్లు, బూబీ ట్రాప్స్ తయారీలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారని వెల్లడించారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందిన నరహరి ఇటీవల బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన మేదర్ దా నమ్మ 1986లో ఉద్యమంలో చేరిన తర్వాత.. ఆమెను నరహరిని వివాహం చేసుకున్నట్టు తెలిపారు. నాగ్‌పూర్ జైలులో ఏడేండ్లు గడిపిన తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీలో చేరి బీహార్-జార్ఖండ్ ప్రాంతంలో సాంకేతిక విభాగంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించిందని చెప్పారు.
లొంగిపోయిన ఈ ఇద్దరికీ తెలంగాణ ప్రభుత్వ పునరావాసం కింద ఆర్థిక సహాయం అందజేసినట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నరహరికి రూ.25 లక్షలు, దానమ్మకు రూ.20 లక్షల రివార్డు మొత్తాలను చెక్కు రూపంలో అందజేశారు. అదనంగా ఆరోగ్య కార్డులు సహా ఇతర పునరావాస ప్రయోజనాలు కూడా కల్పించనున్నట్టు పేరొన్నారు. 2024 నుంచి 2026 వరకు మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఇందులో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 23 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. ఒక్క 2026లో 264 మంది మావోయిస్టు క్యాడర్ లొంగిపోయారని, అందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యు లు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. తెలంగాణకు చెందిన గణపతి, ఆయన భార్య రత్నబాయి, వార్తా శేఖర్ మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ కోరారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, ఐజీ కార్తికేయ, అధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఆయుధాలు పట్టుకొని అన్యాయాన్ని ఎదిరించే సాయుధపోరాటం చాలా కష్టంగా మారిందని మావోయిస్టు పార్టీ అగ్రనేత పసునూరి నరహరి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కల్పించిన పునరావాసం బాగుందన్నారు. తాము పో లీసుల ఎదుట లొంగిపోవడానికి ముందు పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిరి బిస్రీ దాదా నుంచి అనుమతి తీసుకున్నామని చెప్పారు. తన లొంగుబాటుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, ఇంటెలిజెన్స్ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కూడా లొంగిపోవాలని నరహరి సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుందని డీజీపీ తెలిపారు.