ముంబై : పోలీసుగా ఫోజు కొడుతూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగే జనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మహిం పోలీసులు గడిచిన బుధవారం నాడు అనిల్ అశోక్ తడ్వే(35) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసుగా చెప్పి ఆటోరిక్షా డ్రైవర్ నుండి రూ.5 వేలు వసూలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మాస్కులు లేని వారిని చూసి ఏవరూ లేని ప్రదేశంలోకి తీసుకువెళ్లి వారిని బెదిరించి దోచుకునేవాడు. ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ 170, 392, 365 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.