e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News భద్రమైన రుద్రగీత

భద్రమైన రుద్రగీత

మైత్రేయ ఉవాచ- విదురా! పృథు చక్రవర్తికి, అర్చి మహాదేవికి జన్మించిన పుత్రరత్నం విజితాశ్వుడు. అతని కుమారుడు హవిర్ధానుడు. హవిర్ధానుని అర్ధాంగి హవిర్ధాని. ఈ దంపతులకు కలిగిన ఆరుగురు పుత్రులలో జ్యేష్ఠుడు బర్హిషదుడు. సముద్రుని పుత్రి శతధృతి ఇతని పత్ని. వీరికి పుట్టిన పదిమంది పుత్రులు‘ప్రచేతసులు’ అని ప్రసిద్ధి పొందారు. వారు సమాన శీలవ్రతాలు గలవారే కాక ఒకే పేరు గలవారు కూడా.

ధర్మజ్ఞులు, జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు తండ్రిమాటను తలదాల్చి తపస్సుకై పశ్చిమ దిశగా వెళ్లుచూ ఒక విశాలమైన సరస్సును చూచారు. సత్పురుషుని స్వాంతము (మనస్సు) వలె స్వచ్ఛంగా ఉన్న ఆ సరస్సు వారి హృదయాలను ఆహ్లాదపరిచింది. అంతలోనే వారు ఆ భవ్యమైన సరస్సు నుండి ఒక దివ్యపురుషుడు వెడలి రావడం చూచారు. ఆయన ఎవరోకాదు, దయా సముద్రుడు, దేవతలలో అగ్రగణ్యుడు, దామోదర ప్రియుడు అయిన రుద్రుడు. పితృదేవుని ఆజ్ఞానువర్తులైన ప్రచేతసులకు పరమేశ్వర దర్శనం అయాచితంగా కలిగింది. వారు పార్వతీశుని చూచి భక్తి పరవశులై ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లారు. భక్త వత్సలుడైన శంకరుడు సంతసించి పరిశుద్ధ మనస్కులైన ప్రచేతసులతో ఇలా పలికాడు- ‘రాజపుత్రులారా! శ్రీహరి చరణ కమలాలను భక్తితో సేవించువారు నాకు అత్యంత ఇష్టులు. వారికి నేను ప్రియుడను. హరిభక్తుడు తనకు తానే విష్ణుపదం పొందగలడు. సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు తన పుత్రులైన సనత్కుమారులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని పరమ భాగవతులైన మీకు ఉపదేశిస్తాను. అతి రహస్యము, పవిత్రము, మోక్షప్రదము అయిన దానిని స్వీకరించి శ్రద్ధతో జపించండి’. విదురా! పితామహుడు పుండరీకాక్షుని స్మరించి తన పుత్రు లకు మంగళకరమైన నారాయణ స్తోత్రం ఉపదేశించాడు.

- Advertisement -

పోతన సర్వతోముఖ సహజ పాండిత్య సంపన్నుడైన విద్వత్కవి. ‘కవిర్విద్వాన్‌ సుదుర్లభః’- లోకంలో విద్వత్కవులు చాలా అరుదు. అందునా అమాత్యుని వంటి భక్తకవులు ఇంకా అరుదు. మన పోతన ‘వీరభద్ర విజయ’ కావ్యం రచించు నాటికే సంస్కృత ఆంధ్రములలో సరస కవితాగాన కుశలుడు. ఈ కావ్యమున సంస్కృతంలో రాసిన అనేక ‘జయ జయ’ కందములతోపాటు ఉత్పలమాల ఇత్యాది వృత్తాలలోనూ, ఆటవెలది, తేటగీతి, సీసము మొదలైన తెలుగు ఛందస్సులలోనూ సహజ సుందరమైన ఎన్నో సంస్కృత పద్యాలు పఠితలను పరవశింపజేస్తాయి. కందంలోని ప్రతి చరణం ప్రారంభంలో ‘జయ జయ’ శబ్దాలు ఆవృత్తమవుతాయి కాన కందానికా పేరు. ఈ కంద మాకందానికి మచ్చుతునక..
భక్తిరసభరితాలైన ఇట్టి సంస్కృత భాషా పద్యాలు మన ఆంధ్ర భాగవతంలో కూడా ఉన్నాయి.
పద్మభవుడు పద్మనాభుని ఇలా ప్రస్తుతించాడు.. పూర్ణ ఆనంద స్వరూపా! పురుషోత్తమా! సర్వాత్మకా! శ్రీహరీ! నీకు నమస్కారం. జనార్దనా! నీకు జయమగుగాక!
‘దేవదేవా! బ్రహ్మాండమనే పద్మం నీ బొడ్డున ఉంటుంది. నీవు అహంకార స్వరూపుడవైన సంకర్షణుడవు. శాంతమూర్తివి. సర్వజగత్తుకి జ్ఞానదాతవు. పంచతన్మాత్రలకు, దశేంద్రియాలకు నీవే ఆశ్రయం. నీవు అవ్యక్తుడవు. చిత్తానికి అధిష్ఠాతవైన వాసుదేవుడవు. ప్రపంచమంతా నిండిన పుణ్యమూర్తివి. పరిణామ రహితుడవు. దాటరాని కర్మ ప్రవాహాన్ని దాటించువాడవు. వేద సంరక్షకుడవు. త్రిలోకాలను ప్రాణవాయు రూపాన కాపాడువాడవు. ఓషధులను, వనస్పతులను పోషించు రసాత్మకుడవైన చంద్రుడవు. తేజోబల సంపత్తితో స్వయంగా ప్రకాశిస్తావు. ఆద్యంతాలు లేని పురాణ పురుషుడవు. సర్వ కర్మలకు సాధనం నీవే. యజ్ఞఫల రూపుడవు. జీవజాలానికి తృప్తి నీవే. నింగి, నేల నీవే. సర్వలోక సృష్టి, లయ కర్తవైన ఓ సర్వవ్యాపకా! ఓ జయశీలా! నీకు వందనం.’
స్వర్గ అపవర్గ (మోక్ష) ప్రాప్తికి నీవే సాధనం. జల, అగ్ని, సూర్యుడవు నీవే. కృష్ణ, కపిల, బ్రహ్మ, రుద్రులు నీ ప్రతిరూపాలే. ధర్మ రక్షకుడవు, ధర్మ స్వరూపుడవు, సత్పాత్రులకు హితకర ఫల దాతవు. మృత్యురూపంలో దుష్ట శిక్షకుడవు. ధర్మరూపంలో శిష్ట రక్షకుడవు. వృద్ధి క్షయాలు లేని ఆత్మ స్వరూపా! అనిరుద్ధా! నీకు అనంతానంత నమస్కారాలు! సుదర్శన చక్రధారీ! నీ దర్శన భాగ్యం ప్రసాదించు, మాకు ధన్యత కలిగించు. పుండరీకాక్షా! అనఘా! భక్తితో నీ పదవనజా (పద్మా)ల అండ చేరినవారు, ప్రచండ ఆగ్రహంతో బ్రహ్మాండాన్ని ధ్వంసం చేస్తానని బెదిరించే దండధారి
(యముని)కి కూడా భయపడరు.
‘అచ్యుతా! నీ భక్తులతోటి అర్ధ నిమిషపు సత్సంగానికి అపవర్గం (ముక్తి) కూడా సాటిరాదు. ఇక క్షుద్రమైన క్షణిక సుఖాలను గురించి చెప్పేదేముంది? భూతదయాపరులు, రాగద్వేష రహితులు, నిష్కపటులు అయిన సద్భక్తుల సహవాసాన్ని మాకు ప్రసాదించు. ఇదే మా మీద నీవు చూపే అనుగ్రహం’
రుద్ర ఉవాచ- ‘పుత్రులారా! మనసుపెట్టి ఈ ‘యోగాదేశ’ (రుద్రగీత)మనే స్తోత్రాన్ని జపించండి. మీకు సర్వ శుభాలు కలుగుతాయి’ అని ప్రచేతసులను ఆశీర్వదించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు. ఈ నారాయణ స్తోత్రం జపిస్తూ
ప్రచేతసులు పదివేల వత్సరాలు జలమధ్యంలో తీవ్రమైన తపమాచరించారు. (సశేషం)

కం॥ జయజయ! గౌరీ వల్లభ
జయ జయ! గంగావతంస! జయ నిస్సంగా!
జయజయ! గోపతి వాహన!
జయజయ! వేదాంత వేద్య! జయ పరమేశా!

సీ॥ పంకజనాభాయ సంకర్షణాయ శాం,
తాయ విశ్వప్రబోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే,
వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మ నిస్తారకాయ త్రయీ,
పాలాయ త్రైలోక్య పాలకాయ
సోమరూపాయ తేజో బలాఢ్యాయ స్వ,
యం జ్యోతిషే దురంతాయ కర్మ

తే॥ సాధనాయ పురాపురుషాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే‚న్తకాయ విశ్వ
యోనయే విష్ణవే జిష్ణవే నమో‚స్తు

కం॥ హరి! నీ భక్త జనులతో
నిరుపమగతి జెలిమిసేయు నిముషార్ధములో
సరిగాదు మోక్షమనిన న
చిరశుభ మగు మర్త్య సుఖము జెప్పగనేలా

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement