రివ్యూ – హ్యాపీ బర్త్ డే
నటీనటులు : లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్, నరేగ్ అగస్త్య, గుండు సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు : సంగీతం – కాలభైరవ, సినిమాటోగ్రఫీ – సురేష్ సారంగం, ఫైట్స్ – శంకర్ ఉయ్యాల, నిర్మాణం – క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌తో, సమర్పణ – నవీన్ యెర్నేని, వై రవిశంకర్, నిర్మాతలు – చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు, రచన, దర్శకత్వం – రితేష్ రానా.
వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి నాయికగా నటించిన ఈ సినిమాను దర్శకుడు రితేష్ రానా రూపొందించారు. సరికొత్త నేపథ్యం, వైవిధ్యమైన క్యారెక్టర్ డిజైన్ చేయడంతో సినిమా విభిన్నంగా ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలను సినిమా ఎంతవరకు నిలబెట్టుకుందో రివ్యూలో చూద్దాం..
కథేంటంటే:
పలు విమర్శల మధ్య ఆయుధ వినియోగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర మంత్రి రితిక్ సోది (వెన్నెల కిషోర్ ) ప్రతిఫలంగా రష్యా ఆయుధ డీలర్ వ్లాదిమిర్ యురినిక్ నుంచి వేల కోట్ల రూపాయల భారీ మొత్తంలో డబ్బు ముడుపులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాడు. ఓ స్టార్ హోటల్ లోని లాకర్ లో ఆ డబ్బు దాచి పెట్టిన ఆయుధ డీలర్..ఆ లాకర్ పాస్ వర్డ్ ను ఓ పెన్ డ్రైవ్ లో పెట్టి రితిక్ సోదికి ఇవ్వాలనుకుంటాడు. భారీ మొత్తం చేతులు మారుతుందని తెలిసిన గుండా ( రాహుల్ రామకృష్ణ), హోటల్ వెయిటర్ లక్కీ (నరేష్ అగస్త్య)తో విదేశీయుడి నుంచి పెన్ డ్రైవ్ దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో ఆ పెన్ డ్రైవ్ హ్యాపీ (లావణ్య త్రిపాఠి) హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. మరోవైపు మిస్టర్ ఎక్స్ (గుండు సుదర్శన్), ఏ టూ జడ్ ఏ సర్వీస్ అయినా చేసే మ్యాక్స్ పెయిన్ (సత్య) చేత కేంద్ర మంత్రిని ఇబ్బందులు పెడుతుంటాడు. చివరకు హ్యాపీ హ్యాండ్ బ్యాగ్ లోని పెన్ డ్రైవ్ ఎవరికి దొరికింది. ఈ డబ్బు ఎవరు దక్కించుకున్నారు అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్:
సరికొత్త నేపథ్యం
సర్రియల్ కామెడీ
లావణ్య త్రిపాఠీ నటన
మైనస్ పాయింట్స్:
పూర్తి ఊహాజనిత కథ
సహజత్వానికి దూరమైన పాత్రలు
ఎలా ఉందంటే:
తెలుగు తెరకు సర్రియల్ కామెడీ థ్రిల్లర్స్ కొత్త. విభిన్నమైన ప్రయత్నాలు జరగాలని కోరుకునే సినీ ప్రియులు ఇలాంటి కాన్సెప్ట్ లను ఇష్టపడతారు. ఒక కొత్త ఊహా ప్రపంచంలో కథ, పాత్రలు సాగుతుంటాయి. వేల కోట్ల రూపాయల డబ్బు చుట్టూ కథ సాగడం ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఆయుధాల వినియోగంపై కేంద్రమంత్రి రితిక్ సోది చర్చతో సినిమా ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. హ్యాపీ పాష్ పబ్ లోకి ఎంటర్ అవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు స్క్రీన్ ప్లే పరంగా ప్రయోగమని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త నేపథ్యాన్ని అనుభూతి చెందుతాం. పాత్రల ప్రవర్తన, వాటిని డిజైన్ చేసిన తీరు, అవి మాట్లాడే డైలాగ్స్, అనుగుణమైన నేపథ్య సంగీతం ఇవన్నీ హ్యాపీ బర్త్ డే సినిమాను ఒక కొత్త జానర్ లోకి తీసుకెళ్లాయి. దర్శకుడు ఈవీవీ స్టైల్లో నవ్వించే పేర్లతో వేసిన టైటిల్స్ మొదలు..సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వీడియోలను వాడటం, ఆయుధ బిల్ పాసయినప్పుడు న్యూస్ ఛానెల్స్ చేసిన హడావుడి, ఇంగ్లీష్ టీవీ చర్చల్లో తెలుగు డబ్బింగ్…వీటిన్నింటితో దర్శకుడు నవ్వించే ప్రయత్నం చేశాడు.
జాతిరత్నాలు స్టైల్లో ప్రతి పాత్ర ద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా వీలైనంత నవ్వించే ప్రయత్నం చేసిన దర్శకుడు రితేష్ రానా…క్రియేటివ్ ఫ్రీడమ్ ను కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నాడు. ఇంకో అడుగు ముందుకేసి బూతులూ వాడాడు. దాంతో పాత్రల ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఎంత ఫిక్షనల్ వరల్డ్ లో సినిమా నడిచినా, దానికో లాజిక్ అంటూ ఉంటుంది కదా. ఆ లాజిక్ వదిలిపెట్టి మ్యాజిక్ చేయాలనుకున్నాడు. లావణ్య త్రిపాఠికి సంబంధించి ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఆమెకు మళ్లీ దొరక్కపోవచ్చు. సత్య బాగా నవ్వించాడు, వెన్నెల కిషోర్ పాత్ర కూడా వినోదాన్ని పంచుతుంది. లక్కీ పాత్రలో నరేష్ అగస్త్య తన పరిధి మేరకు మెప్పించాడు. నేపథ్య సంగీతం సినిమాను ఫాలో అయ్యింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. వెరైటీ సినిమా చూడాలనిపిస్తే హ్యాపీ బర్త్ డే ఒక ఆప్షన్.
చివరగా…వెరైటీ కోరుకుంటే హ్యాపీనే
రేటింగ్: 2.5/5