‘భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించను. ఈ రోజు ఆనందంగా గడచిపోతే చాలానుకుంటా. ఆ సిద్ధాంతాన్ని నమ్మే ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నా’ అని అన్నారు సంపూర్ణేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ఆర్కే మలినేని దర్శకుడు. ఆశాజ్యోతిగోగినేని నిర్మాత. ఈ నెల 26న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో సంపూర్ణేష్‌బాబు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నేను ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రమిది. ఆండీఫ్లవర్, క్యాలీఫ్లవర్ అనే పాత్రల్లో కనిపిస్తా. శీలాన్ని కాపాడుకోవడం మగవాళ్లకు ముఖ్యమేననే వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించాం. తనకు జరిగిన అన్యాయంపై క్యాలీఫ్లవర్ ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. నా గత సినిమాల శైలి స్ఫూఫ్‌లు లేకుండా విభిన్నమైన కథాంశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. నటుడిగా ఎలాంటి పాత్రను చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ప్రేక్షకుల్ని నవ్వించడమే నిజమైన సక్సెస్‌గా నమ్ముతున్నా. ‘కొబ్బరిమట్ట’ తర్వాత నేను చేసిన సినిమాలేవి సరిగా ఆడలేదు. తాము చెప్పిన కథలను దర్శకులు సరిగ్గా తెరపై ఆవిష్కరిస్తున్నారా?లేదా? అనేది పట్టించుకోకుండా చేయడమే అందుకు కారణం. ఆ పొరపాటు నాదే అనుకుంటున్నా. ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ప్రస్తుతం హీరోగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నా. తమిళంలో కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నా’ అని తెలిపారు.