సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోతున్నాయి. ఇక ఎలివేటెడ్ ప్రాజెక్టు కోసం గతంలో బీఆర్ఎస్ సర్కార్ రక్షణ శాఖ నుంచి భూముల స్వాధీనానికి అహర్నిశలు కృషి చేసింది. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మెట్రో రెండో దశ విస్తరణ పేరిట రూ.45వేల కోట్ల డీపీఆర్‌ను కేంద్రానికి పంపిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ప్రాజెక్టులను కట్టలేక చేతులు ఎత్తివేయడంతో ప్రచారం కోసం వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాగితాలను దాటి కార్యరూపంలోకి తీసుకురాలేకపోయింది.
రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో నగరంలో 120 కిలోమీటర్ల రెండో దశ మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం చెక్కిన మూడు నెలల్లోనే డీపీఆర్ రూపొందించి కేంద్రానికి అప్పగించారు. కానీ డీపీఆర్‌లో ఉన్న లోపాలు, ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఎల్ అండ్ టీ సమన్వయం, నిధుల సర్దుబాటు వంటి అంశాలపై అనుమతులు ఇవ్వలేదు. ముఖ్యంగా రెండో దశ విస్తరణ కోసం ఎల్ అండ్ టీతో అవగాహన ఒప్పందం ఉండాలనీ, లేదంటే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో.. డీపీఆర్ అక్కడే మూలుగుతున్నది. తాజాగా పెరుగుతున్న అప్పుల భారం, ప్రభుత్వ వైఖరితో హైదరాబాద్ మెట్రో నిర్వహణ కష్టమేనని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎల్అండ్టీ సంస్థ చేతులు ఎత్తివేసింది.
దీంతో గల్లాపెట్ట్టె ఖాళీగా ఉన్నా.. పెరిగే అప్పుల భారంపై స్పష్టత లేకుండానే మొత్తం రూ.15వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.ఈ క్రమంలో ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన డబ్బుల కోసం ఇప్పుడు ఆర్థిక సంస్థల వెంట పడుతున్నా రూపాయి పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ వ్యవహారం తేలేంత వరకు ప్రాజెక్టు కోసం కేంద్రం అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును చేపడుతామంటూ బీరాలు పోతుందే తప్పా… ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇదంతా పరిష్కారమయ్యేంత వరకు కనీసం ఏడాదిన్నర పట్టనుండగా.. కాగితాలపై రూపొందించిన విస్తరణ ప్రణాళికలన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి.
రక్షణ శాఖ నుంచి భూముల సేకరణకు బీఆర్ఎస్ హయాంలో అహర్నిశలు కృషి చేసింది. నార్త్ సిటీ అభివృద్ధికి అనుగుణంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రణాళికలు రూపొందించింది. అయితే తదనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రహణం పట్టుకుంది. అధికారం చేపట్టిన మూడు నెల్లోనే ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది పరిస్థితి. 18 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,500కు పైగా ఆస్తులను సేకరించాలని భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఇప్పటివరకు ఇంచు భూమిని కూడా సేకరించలేకపోయింది.
అయితే స్థానికుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో.. భూసేకరణ ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. కనీసం బాధితులతో మాట్లాడకుండా, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడిందే తప్పా… ఏనాడు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయలేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. వందలాది భూ బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో తాజా భూసేకరణ వ్యవహారం మరో ఏడాదిన్నర వరకు ముట్టుకోలేమని తేల్చి పక్కన పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా అతీగతీ లేకుండా మిగిలిపోయింది.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విస్తృతమైన ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నాలా అభివృద్ధితో దూసుకుపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నగరాభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇందులో ప్రధానమైనవి మెట్రో రెండో దశ విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్. దీనికి తోడు హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి నగరాభివృద్ధిని అయోమయంలో పడేశారని రియల్ వ్యాపారులు, ప్రజల నుంచి కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.