మహిళలు విమానాలు, నౌకలు, రైళ్లు నడుపుతున్నారు. కార్లు, బస్సులు సునాయాసంగా తోలుతున్నారు. కానీ, కాలనీలో టూవీలర్ నడపాలంటే మాత్రం జంకుతున్నారు. ఎక్కడి కెళ్లినా ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లాల్సిందే. అలాంటివారికి బండి నేర్పిస్తున్నది ‘స్త్రీ రైడ్స్’ వ్యవస్థాపకురాలు అర్చన చిగుళ్లపల్లి.
అర్చన చదువుకునే రోజుల్లోనే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేది. వలంటీర్‌గా అనాథాశ్రమాలకు ఆహారం అందించేది. బైక్‌మీదే హైదరాబాద్ అంతా తిరిగేది. తోటి అమ్మాయిలను కూడా బైక్ నడపమని కోరేది. కానీ, చాలామందిలో తెలియని భయం. ఇంట్లో ఏమంటారో అని, కింద పడిపోతామేమోనని! ఈ బెరుకును పారదోలేది అర్చన. దీంతో ‘మాకూ నేర్పించు’ అని రిక్వెస్ట్ చేసుకునేవారు. అలా డ్రైవింగ్ నేర్పించడం హాబీగా మొదలై, ప్రొఫెషన్‌గా మారి, ‘స్త్రీ రైడ్స్’ పేరిట ఓ సంస్థ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చింది.
మహిళల కోసమే : మాదాపూర్‌లోని ఓ ఐటీ ఉద్యోగికి అమెరికాకు బదిలీ అయ్యింది. అప్పటి వరకు ఆయనే ఇంటిపనులన్నీ చూసుకొనేవాడు. దాంతో ఆమె బయట కాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకున్నది. తెలిసిన వాళ్లు ‘స్త్రీ రైడ్స్’ గురించి చెప్పారట. భయపడుతూనే వెళ్లింది. మూడు రోజుల్లో బైక్ నేర్చుకొని, నాలుగోనాడు వాళ్లబ్బాయిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసింది.
నేర్పడం ఒక హాబీ : “ఆరో తరగతిలోనే టూవీలర్ నేర్చుకుంటే బాగుండనిపించింది. ‘బండి నేర్పించండి ప్లీజ్?’ అని నాన్నను అడిగాను. ఆయన సంతోషంగా ఒప్పుకొన్నారు. వెనకాల కూర్చొని చేతక్ నేర్పించారు. నేను రివ్వున దూసుకెళ్తుంటే ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయేవారు. తర్వాత వాళ్లకూ నేర్పించాను. ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నప్పుడూ అంతే. నన్ను చూసి చాలామంది బండి తోలడానికి ముందుకొచ్చారు. నేనే డ్రైవింగ్ పాఠాలు చెప్పాను” అంటున్నది అర్చన.
విజయ రహస్యం: ‘ఎంబీఏ చేస్తుండగానే నాకు పెండ్లయ్యింది. పెండ్లి తర్వాత లైఫ్ స్టయిల్ కొద్దిగా మారుతుంది కదా? అలా నాకూ కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత మా ఆయన నన్ను అర్థం చేసుకొని అన్ని విధాలా ఎంకరేజ్ చేశారు. ఎంబీఏ కంప్లీట్ చేయించారు. ఎన్జీవోలకు వెళ్తానంటే కాదనలేదు. బైక్ నడుపుతానంటే వద్దనలేదు. ఆయన ప్రోత్సాహంతోనే, నాలుగేండ్ల క్రితం ‘స్త్రీ రైడ్స్’ను స్థాపించాను. 16 సంవత్సరాల నుంచి 70 ఏండ్లవారు స్త్రీ రైడ్స్ ద్వారా బైక్ నేర్చుకోవడానికి వస్తున్నారు. బండి నేర్పించడం ఒక ఆర్ట్. మిగతావాళ్లకు నాకు తేడా ఏంటంటే, బైక్ నడిపేటప్పుడు నేను వారితోపాటు ఉండను. కానీ, వారి ధ్యాసలో ఉంటాను. ఇప్పటి వరకు నా దగ్గరికి శిక్షణకు వచ్చిన ఏ ఒక్కరూ బైక్‌పై నుంచి కింద పడలేదు. దానికి నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది వారం రోజుల కోర్స్. నాకు ఫీజు ముఖ్యం కాదు. హైదరాబాద్‌లో ఏ గృహిణి అయినా, అమ్మాయి అయినా ధైర్యంగా డ్రైవింగ్ చేయాలనేదే నా ఉద్దేశం. నేను ముందుగా రోడ్ రూల్స్, తర్వాత ట్రాఫిక్ రూల్స్ బోధిస్తాను. ఇతరుల సహాయం లేకుండా టూవీలర్ నడపడానికి సైకలాజికల్‌గా వాళ్లను బలోపేతం చేస్తాను. కింద పడతామనే భయాన్ని పోగొడతాను. చాలావరకు నా దగ్గరికి వచ్చేవాళ్లు ఫోబిక్ పీపుల్. స్టెప్-బై-స్టెప్ రూల్స్ నేర్పిస్తేనే వాళ్లలో ఆ ఫోబియా పోతుంది. అప్పుడే బండి నడిపే కాన్ఫిడెన్స్ వస్తుంది” అంటూ తన విజయ రహస్యాన్ని వివరిస్తుందామె. ఇప్పటి వరకు వేల మంది మహిళా టూవీలర్ డ్రైవర్లను తయారుచేసింది అర్చన.