e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News వైద్యుల కృషితోనే అంతా సురక్షితం

వైద్యుల కృషితోనే అంతా సురక్షితం


కోవిడ్‌ కాలంలో వారి సేవలు గొప్పవి
పనిచేసే ప్రభుత్వాలకే పట్టం కట్టాలి
తెలంగాణ వైద్యుల సమావేశంలో కేటీఆర్

వైద్యుల కృషితోనే అంతా సురక్షితం

హైదరాబాద్‌, మార్చి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రతి పౌరుడి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలన్నది తమ ప్రభుత్వకల అని, అప్పుడే అందరికీ సకాలంలో సరైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జలవిహార్‌లో శనివారం తెలంగాణ వైద్యులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత ఆరేండ్లలో తమ ప్రభుత్వం అద్భుత ప్రగతిని సాధించిందని, వైద్య రంగంలోనే అనేక అభివృద్ధి పనులు చేశామనిచెప్పారు. కేసీఆర్‌ కిట్లు, టీకాల కార్యక్రమం, అమ్మ ఒడి, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, డయాలసిస్‌ సెంటర్లు వంటివి ఇందులో ఉన్నాయని తెలిపారు.
ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదాలు నివారించేందుకు 10 ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేశామని, త్వరలో హెలికాప్టర్‌ అంబులెన్స్‌ సేవలు ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది ఎంతో సేవచేశారని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. ‘తెలంగాణ ఏర్పాటకు ముందు 5 మెడికల్‌ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 10కి పెంచాం. గతంలో 700 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 1650 మెడికల్‌ సీట్లు ఉన్నాయి. పీజీ సీట్లు 531 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 835 పెరిగింది. సూపర్‌ స్పెషాల్టీ సీట్లు గతంలో 58 ఉంటే, ఇప్పుడు 86 అయ్యాయి. ైస్టెపెండ్‌ పెంచుకున్నాం. మెడికల్‌ పీజీ విద్యార్థులు ఏడాది పాటు ఉచితంగా ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే నిబంధన తొలగించాం’ అని వివరించారు.
వైద్యారోగ్యం పటిష్టం….
‘కేసీఆర్‌ కిట్లు, ఇమ్యునైజేషన్‌ వల్ల తెలంగాణలో ఎంఎంఆర్‌ 93 నుంచి 63 తగ్గింది. ఐఎంఆర్‌ 39 నుంచి 26.4కు తగ్గింది. కేసీఆర్‌ కిట్ల వల్ల ఇన్‌స్టిట్యూషన్‌ డెలివరీలు 30శాతం నుంచి 50శాతానికి పెరిగాయి. దీంతో ప్రైవేటు డాక్టర్లకు గిరాకీ తగ్గింది. ఇమ్యూనైజేషన్‌ కోసం కేంద్రం తెచ్చిన మిషన్‌ ఇంద్రధనుష్‌ పథకంలో మనం నం.1గా ఉన్నాం. గతంలో రాష్ట్రంలో 254 ఆక్సిజన్‌ బెడ్లు ఉంటే, ఇప్పుడు 11,758 ఉన్నాయి. వెంటిలేటర్‌ బెడ్స్‌ 100 నుంచి 1484కు పెరిగాయి. ప్రస్తుతం ఐసీయుల సంఖ్య 20 ఉండగా, త్వరలో వీటిని పెంచి అన్ని ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేస్తాం. మెటర్నల్‌ ఐసీయులు 5కు పెరిగాయి. స్పెషాలిటీ ఐసీయూలు ఒకటి ఉంటే, ఇప్పుడు 8 అయ్యాయి. ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఇప్పుడు 25 ఏర్పాటు చేశాం. గర్భిణుల కోసం 241 అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. గతంలో ఒకటే వైరాలజీ ల్యాబ్‌ ఉంటే 23 ఏర్పాటుచేశాం. కేసీఆర్‌ కిట్లను ఇప్పటివరకు 8.68 లక్షల మందికి పంపిణీ చేశాం.
ప్రపంచంలో అతి పెద్ద ఐ స్క్రీనింగ్‌ క్యాంపెయిన్‌ కంటి వెలుగు నిర్వహించి ఒకటిన్నర కోట్ల మందికి పరీక్షలు చేశాం. 40 లక్షల మందికి కండ్ల్ల జోళ్లు అందిచ్చాం. పట్టణాల్లో ఉండే పేదల కోసం 350 బస్తీ దవాఖానలు ప్రారంభించుకున్నాం. 46 ఉచిత డయాలసిస్‌ సెంటర్లు ప్రారంభించాం. మనిషి చనిపోతే ఇంట్లో దించేందుకు ప్రత్యేకంగా 50 వాహనాలు ఏర్పాటు చేశాం’ అని మంత్రి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం రాష్ట్రానికి ఏ విధంగా మద్దతు రావడం లేదని ఆరోపించారు. మెడికల్‌ కాలేజీల కేటాయింపులో తెలంగాణకు మొండిచేయి చూపించారని పేర్కొన్నారు. అందుకే పనిచేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవీ, పల్ల రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్‌ బూరనర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ మంద జగన్నాథం, వైద్యులు సురేశ్‌, మధుశేఖర్‌, భాస్కర్‌రావు, బొంగు రమేశ్‌, పుట్ల శ్రీనివాస్‌, రవీందర్‌, కిషన్‌రావు, జూనియర్‌ వైద్యుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వైద్యుల కృషితోనే అంతా సురక్షితం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement