Kriti Shetty | ‘ఉప్పెన’లా వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచిన కన్నడ భామ కృతి శెట్టి. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న కృతి.. వరుస అవకాశాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది. ‘ది వారియర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన అందాల బేబమ్మ ముచ్చట్లు..
ద్విభాషా చిత్రాల ద్వారా రెండు భాషల ప్రేక్షకులకూ దగ్గరయ్యే అవకాశం లభిస్తున్నది. ‘ది వారియర్’తో కోలీవుడ్ ప్రేక్షకులనూ అలరించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు లింగుస్వామి తీసిన ‘ఆవారా’ సినిమా చూశాను. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నటనకూ ఆస్కారం ఉంటుంది.
కన్నడ కుటుంబంలో పుట్టినా నేను ముంబైలోనే పెరిగాను. సైకాలజీలో డిగ్రీ చేశాను. మనుషుల గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. సినిమాల్లోకి వచ్చేముందు కెరీర్ ఎలా ఉంటుందోనని కొంచెం భయపడ్డాను. కానీ ‘ఉప్పెన’తో తెలుగు, తమిళ భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అనేక అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు నేర్చుకున్నా, తమిళం
కూడా నేర్చుకుంటున్నా.
ఏ సినిమా ఒప్పుకొన్నా, ముందు ఆ పాత్రకు తగినట్టు నన్ను నేను మలుచుకుంటా. ఆ సినిమాలో నేను పోషించబోయే పాత్ర గురించి నోట్స్ రాసుకుంటా. ప్రేక్షకులను అలరించడమే నా బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు ఎంతైనా కష్టపడతా. అందుకే, ఒత్తిడి ఎదురైనా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తా. కథ వింటున్నప్పుడే ఆ పాత్ర నాకు సరిపోతుందో, లేదో నిర్ణయించుకుంటా. సినిమా అంగీకరించే ముందు అమ్మ అభిప్రాయం కచ్చితంగా తీసుకుంటా.
కథకు అవసరం అనుకుంటేనే లిప్‌లాక్‌లు, బోల్డ్సీన్స్ అంగీకరిస్తా. అదంతా నటనలో భాగంగానే భావిస్తా. యాక్షన్ సీన్లు ఎంతో.. బోల్డ్సీన్లూ అంతే.. వాటిని వేరేగా చూడను. కానీ రొమాంటిక్ సీన్స్‌లో నటించేవారిని చాలామంది చులకనగా చూస్తారు. నాయికానాయకుల మధ్య బంధాన్ని చెప్పాలంటే రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందే. అనవసరంగా జొప్పిస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను.
యాక్షన్ పాత్రల్లో నటించాలనేది నా కల. రామ్‌చరణ్, మహేశ్‌బాబు నా అభిమాన హీరోలు. వాళ్ల పక్కన నటించాలని ఉంది. ‘బంగార్రాజు’, ‘శ్యామ్‌సింగరాయ్’ సినిమాల విజయం నాపై నాకు నమ్మకం పెంచింది. ప్రస్తుతం నాగచైతన్యతో మరో చిత్రంలో నటించబోతున్నా. నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు చేస్తున్నా. సుధీర్‌బాబు సినిమాలో అయితే, అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా కనిపిస్తా.
Keerthy Suresh | కీర్తిసురేష్‌కు ఆ స్టార్ హీరో నటనంటే చాలా ఇష్టమట?