Komuram Bheemudo song | కొన్ని చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ హవా ఇంకా కొనసాగుతుంది. జక్కన్న రాజమౌళి చెక్కిన ఈ దృశ్య కావ్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికి ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. చిత్రం విడుదలై నలభై రోజుల దాటినా కొన్ని చోట్ల మంచి వసూళ్ళే వస్తున్నాయి. చరణ్, తారక్‌ల నటనకు సినీప్రముఖులు సైతం జైజైలు కొట్టారు. ఇండియాలో వరుసగా రెండు సార్లు 1000కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. నైజాంలో 100కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. కాగా ఈ చిత్ర విజయంలో పాటలకు కూడా కొంత వరకు క్రెడిట్ దక్కుతుంది.
ఎమ్ఎమ్ కీరవాణి స్వర పరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘దోస్తీ’, ‘నాటునాటు’, ‘కొమ్మ ఉయ్యాల’ వీడియో సాంగ్స్ విడుదలవగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్సప్రేషన్స్ తాను ఎంత గొప్ప ఆర్టిస్టు అని తెలుస్తుంది. సుద్ధాల ఆశోక్ తేజ లిరిక్స్ ఆయుధంతో కాదు పాటతో కూడా ప్రజల్లో ధైర్యాన్ని నింపవచ్చు అనే విధంగా ఉన్నాయి. కాలభైరవ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌గా మారింది.