కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 26: మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వీధుల్లో మండపాలను ఏర్పాటు చేసి కనకదుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. నేలపట్ల, గట్టుసింగారంలో విగ్రహాల ఏర్పాటుకు జడ్పీటీసీ ఇంటూరి బేబీ, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ సాయం అందజేశారు.
మధిరటౌన్, సెప్టెంబర్ 26: దేశభక్త యువజన సంఘం లడక్బజార్ వారి ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కాకాని శ్రీనివాసరావు, రజిని దంపతులు అమ్మవారి అలంకరణల కోసం మధిర మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మొండితోక నాగరాణి, 18వ వార్డు కౌన్సిలర్ అరిగె రజినీకుమారి సమక్షంలో దేశభక్త యువజన సంఘం కమిటీకి పట్టువస్ర్తాలు అందజేశారు.
ముదిగొండ, సెప్టెంబర్ 26: మండల వ్యాప్తంగా సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముదిగొండలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
కూసుమంచి, సెప్టెంబర్ 26: మండలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచిలాంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. రోజూ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు.
చింతకాని, సెప్టెంబర్ 26: మండల వ్యాప్తంగా గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు సంబురంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేసి అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 26: జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్వాంగ అభిషేకం, నూతన వస్ర్తాల అలంకరణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.