హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్- మ్యాన్ ఆఫ్ ది నేషన్’ షార్ట్ ఫిలింను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అన్ని భారతీయ భాషల్లో ఈ షార్ట్ ఫిలిం నిర్మాణం జరుపుతుండగా ఇంగ్లిష్ వర్షన్‌ను కవిత విడుదలచేశారు.
పాన్ ఇండియా సినిమా తరహాలో మొట్టమొదటి పాన్ ఇండియా షార్ట్ ఫిలిం ఇదే. ఐదు నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఎంఎస్ అనురాగ్బాబు కాగా, కల్వకుంట్ల కవిత సహకారం అందించారు. రైతు సంఘం నాయకుడు కోటపాటి నరసింహనాయుడు వివిధ రాష్ర్టాల్లో పర్యటించే సమయంలో రైతు సదస్సుల్లో ఆయా భాషల్లో ఈ షార్ట్ ఫిలింను ప్రదర్శించనున్నారు. ఐదు నిమిషాల నిడివిలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా చూపించారని యూనిట్ సభ్యులను కవిత అభినందించారు.