బెంగళూరు: కన్నడిగులకు మరో అవమానం జరిగింది. ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. భారతదేశంలో అతి వికారమైన భాషగా కన్నడను పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కెనడా.. కన్నడ రాష్ట్ర జెండాతో ముద్రించిన బికినీని అమ్మకానికి పెట్టింది.
దీనిపై కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబాలి మండిపడ్డారు. అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని అమెజాన్ను ఆయన డిమాండ్ చేశారు. ఇది కన్నడిగుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఇలాంటివాటిని తాము సహించబోమని అన్నారు. ఇటీవలే గూగుల్ తమ భాషను అవమానించిందని మండిపడ్డారు. ఇకనైనా బహుళజాతి సంస్థలు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.