కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బింబిసార’.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె
నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథతో కొత్త దర్శకుడు వశిష్ఠ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్ నాయికలు. ఈ నెల 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ఠ్ చిత్ర విశేషాలు తెలిపారు.
నాకు విఠలాచార్య, సింగీతం వంటి దర్శకులు చేసిన జానపద చిత్రాలంటే ఇష్టం. చందమామ కథలు ఇష్టపడి చదువుతా. ఇలాంటి సోషియో ఫాంటసీ చిత్రాలు రూపొందించాలని ఉండేది. బాలకృష్ణ ‘ఆదిత్య 369’ చిత్ర స్ఫూర్తితో టైమ్ ట్రావెల్ కథ రాసుకున్నాను. అదే బింబిసార. కీచకుడు, రావణాసురుడు, బకాసురుడు వీళ్లు ఎంత రాక్షసులో అంతకంటే క్రూరమైన బింబిసారుడు మంచివైపు ఎలా మళ్లాడు అనేది చూపిస్తున్నాం. మనం ఇప్పటిదాకా ‘యమగోల’, ‘యమలీల’, ‘యమదొంగ’ వంటి చిత్రాల్లో ఇతర లోకాల నుంచి భూలోకానికి క్యారెక్టర్స్ రావడం చూశాం. ఇక్కడ ఒక రాజు మరో కాలం నుంచి ఈ కాలానికి వస్తాడు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.
ఈ కథకు ఒక రాజు పేరు పెట్టాలని అనుకున్నప్పుడు బింబిసారుడు బాగుంటుంది అనిపించింది. చరిత్ర నుంచి మేము తీసుకున్నది ఆ పేరు మాత్రమే. ఆ రాజుకు సంబంధించిన విషయాలేవీ కథలో, పాత్రలో ఉండవు. అంతా కల్పితమే. కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ నుంచి పరిచయం ఉంది. ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఎక్కడా పెద్ద కథ, బడ్జెట్ గురించి ఆలోచించలేదు. కథ బాగుంది చేద్దామన్నారు. త్రిగర్తల సామ్రాజ్యానికి సంబంధించిన సెట్ వర్క్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. బింబిసారుడి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కళ్లతోనే అభినయం చూపించారు. ఫ్యూచర్లో బింబిసార పాత్ర అంటే కళ్యాణ్ రామ్ గుర్తొస్తారు.
మా చిత్రాన్ని ‘మగధీర’, ‘బాహుబలి’లా ఉంటుందా అని అడుగుతున్నారు. అలాంటి గొప్ప చిత్రాలతో పోల్చడమే సం తోషంగా ఉంది. అయితే ఆ చిత్రాలకు ‘బింబిసార’కు కథా నేపథ్యంలో ఎలాంటి సంబంధం లేదు. ట్రైలర్లో రెండు గెటప్‌లతో హీరో పాత్ర కనిపించడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. మా సినిమాలో రాజు చెడు నుంచి మంచికి ఎలా ప్రయాణం సాగించాడు అనేది చూపిస్తున్నాం. ఆ సినిమాలు సోషియో ఫాంటసీ అయితే ఇది టైమ్ ట్రావెల్ మూవీ.
‘బింబిసార’ కథ చాలా విస్తృతమైనది. పాత్రలన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రెండు భాగాలుగా రూపొందించాలని ముందే అనుకున్నాం. దీన్ని ‘సూపర్‌మ్యాన్’,‘స్పైడర్ మ్యాన్’ లాంటి సూపర్‌హీరో కథల్లా ప్రాంఛైజీగానూ చేసే ఆలోచనలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్రారంభిస్తాం. తొలిభాగంలో చూడని బింబిసారను కొనసాగింపు చిత్రంలో చూస్తారు.