అమరావతి : ఏపీ ప్రభుత్వ వైఫల్యాల ( AP Government Failures) నుంచి తప్పించు కోవడానికి చంద్రబాబు బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh ) ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్( Twitter ) లో పేర్కొన్నారు.
చంద్రబాబు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 18 నెలలుగా ప్రభుత్వం మీది. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేని ఆరోపించారు.
నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ వైసీపీ నాయకులపై బురదచల్లి అక్రమ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మొంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి జోగి రమేష్ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపించారు.
నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగిరమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోందని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మీ మాఫియా వ్యవహారాలపై మీరే విచారణ చేయించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.