హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నైపుణ్య శిక్షణ పేరుతో అభ్యర్థులను ఇబ్బడిముబ్బడిగా చేర్చుకొన్నామా? ఏదో మొక్కుబడిగా చెప్పామా? ఒక సర్టిఫికెట్ చేతిలో పెట్టామా? అంతే. ఇదీ గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాల దుస్థితి. ఇప్పటికీ కేంద్రంలో, ఇతర రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉపాధి దొరికే రంగాలపై దృష్టి సారించి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నది. అవసరమైతే అత్యాధునిక టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నది. ముఖ్యంగా దళిత యువత.. సమాజంతో పోటీపడేలా విశేష కృషి చేస్తున్నది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభ్యర్థుల్లో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పును తీసుకొచ్చే లక్ష్యంతో పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతూ సత్ఫలితాలను సాధిస్తున్నది. బహుళజాతి సంస్థలు, ప్రముఖ కంపెనీల్లో ఉన్నత కొలువులు సాధించేలా తీర్చిదిద్దుతున్నది.
విద్యార్హతను బట్టి శిక్షణ
పదో తరగతి మొదలు ఉన్నత చదువులు చదివి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి విద్యార్హతను బట్టి, వ్యక్తిగత నైపుణ్యాలను గుర్తించి వారికి అనుగుణమైన రంగాన్ని ఎంపిక చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బ్యాచ్‌కు కేవలం 30-60 మందినే తీసుకొంటున్నది. వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, 3 నెలల నుంచి ఏడాది పాటు ఉచిత భోజన, వసతిని కల్పిస్తూ ఉపకారవేతనాన్ని కూడా అందిస్తున్నది. మొత్తంగా ఒక్కో అభ్యర్థిపై రూ.50-90 వేల వరకు ఖర్చు చేస్తూ ఆయా రంగాల్లో నిపుణులుగా తయారు చేస్తున్నది. సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉద్యోగం సాధించేలా కృషి చేస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తున్నది. శిక్షణతో ఆగిపోకుండా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రత్యేక జాబ్‌మేళాలను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఇప్పటికే 16కు పైగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకొన్నది.
వైద్యం, విదేశాల్లో ఉపాధి
వైద్య రంగంలోని ఉపాధి అవకాశాలను ఎస్సీ యువత అందిపుచ్చుకొనేలా ఎస్సీ కార్పొరేషన్ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే అపోలో మెడి స్కిల్స్ ఆధ్వర్యంలో ఆధునిక కార్డియాలజీ కేర్ టెక్నాలజీ, ఆధునిక ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అత్యవసర వైద్య నిపుణుడు, సాధారణ సహాయకుడు, దంత సహాయకుడు, రిఫ్రెష్ ట్రైనింగ్ ఫర్ ఏఎస్ఎం టీఐఏఆర్ ట్రేడ్ ట్రైనింగ్, రోబోటిక్ సర్జరీ విభాగాల్లో దళిత యువతకు శిక్షణ ఇప్పించి కార్పొరేట్ దవాఖానల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఇప్పుడు విదేశాల్లో నర్సుల సేవలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అవసరమైన లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీలో తర్ఫీదునివ్వాలని నిర్ణయించింది. తొలి విడతగా 30 మందితో ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదనలను రెడీ చేసింది.
ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి
ఐటీ సంబంధిత కోర్సులు చదివిన ఎస్సీ యువతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అత్యాధునిక టెక్నాలజీలపై తర్ఫీదునిస్తున్నది. ప్రముఖ టెక్ నాలెడ్జ్ సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్స్ సంస్థల ఆధ్వర్యంలో జావా, పైథాన్, టెస్టింగ్, త్రీడీ యానిమేషన్, ఏఐ, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ తదితర ఎమర్జెన్సీ టెక్నాలజీలపైనా శిక్షణ అందిస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అనేక మంది ఎస్సీ యువతీయువకులు టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో కొలువుల్లో చేరటం విశేషం.
ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో శిక్షణ ఇలా..
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎస్సీ ఆపరేషన్ వర్టికల్ మెషీన్ సెంటర్, ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్, ఫీల్డ్ ఇంజినీర్ ఇన్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండీషనింగ్ అండ్ వాషింగ్ మెషిన్, ఆర్క్ వెల్డింగ్, వెల్డింగ్, ఫీల్డ్ టెక్నీషియన్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్, అసెంబ్లింగ్ ఆపరేటర్, టాలీ, ఎంఎస్ ఆఫీస్.
జాతీయ నిర్మాణ రంగ సంస్థ ఆధ్వర్యంలో ఫినిషింగ్, స్కూల్ ప్రోగ్రాం, కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, జనరల్ వర్క్స్ సూపర్వైజర్, ఐకియా ఫర్నిచర్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకోరేషన్, డ్రై వాల్ ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, ల్యాండ్ సర్వేయర్, స్టోర్ కీపర్, వెల్డింగ్.
టీఎంఐ ఈ2ఈ అకాడమీ ఆధ్వర్యంలో డీటీహెచ్ ఇన్స్టాలేషన్, ఏసీ ఇన్స్టాలేషన్ కెల్ట్రాన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డాటా ఎంట్రీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ హార్డ్‌వేర్, లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ రిటైల్ ప్రొఫెషనల్స్, ఎంఎస్ ఆఫీస్ అండ్ బేసిక్స్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మాన్ఫిన్ కోర్సు, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్ మల్టీక్యూజిన్ కుక్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్, రూమ్ అటెండెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్.
నిమ్స్‌మే సంస్థ ఆధ్వర్యంలో యానిమేషన్, డిజిటల్ ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్, మేకప్.
స్మాల్ పౌల్ట్రీ ఫామ్, బ్రాయిలర్ ఫామ్ వర్కర్, సెట్విన్ సంస్థతో మొబైల్ సర్వీసింగ్ అండ్ సేల్స్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్, ఆటో క్యాడ్, బ్యూటీషియన్.
ఎస్ సంస్థ ఆధ్వర్యంలో మార్కెటింగ్, మార్కెటింగ్ బీపీవో, వాయిస్, నాన్‌వాయిస్.
క్యాప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్ శిక్షణ.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. శిక్షణ పొందిన ప్రతి అభ్యర్థి ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎస్సీ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– కొప్పుల ఈశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
జాతీయ స్థాయి సంస్థలతో శిక్షణ
గ్రామీణ ఎస్సీ యువతలో ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాం. జాతీయస్థాయిలో ఖ్యాతి పొందిన సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నాం. స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులను అందిస్తున్నాం. ఉచిత భోజన, వసతి సదుపాయాలతో పాటు రవాణా ఖర్చులు, ైస్టెపెండ్ను కూడా అందిస్తున్నాం.
– బండ శ్రీనివాస్, చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్