టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆసియా కప్ ముందు గాయంపాలైన బుమ్రా.. ఎన్సీయేలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో పునరాగమనం చేశాడు. తొలి మ్యాచ్లో అతనికి విశ్రాంతినిచ్చిన టీం మేనేజ్మెంట్.. రెండో మ్యాచ్లో బుమ్రాను ఎంపిక చేసింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా.. రెండు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఆరోన్ ఫించ్ వికెట్ తీసుకున్నాడు.
అతని వికెట్ తీసుకోవడానికి బుమ్రా వేసిన డెలివరీని ఫించ్ కూడా మెచ్చుకున్నాడు. అతను వేసిన యార్కర్లను చూసిన పాక్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా.. బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా సూపర్ పునరాగమనం చేశాడని, వచ్చే టీ20 ప్రపంచకప్లో అతను కచ్చితంగా కొన్ని బొటనవేళ్లు విరగ్గొడతాడంటూ కామెంట్ చేశాడు. అదే సమయంలో హర్షల్ పటేల్ ఏమాత్రం ఆకట్టుకోలేదని పెదవి విరిచాడు.
ఈ మ్యాచ్లో కూడా ధారాళంగా పరుగులు ఇచ్చాడని విమర్శించిన కనేరియా.. ‘పరిస్థితుల వల్ల బంతి తడిగా మారింది నిజమే. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ అదొక్కటే కారణంగా చూపించడం కుదరదు’ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చిన పటేల్.. రెండో మ్యాచ్లో రెండు ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ అతను ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.
Aaron Finch applauding #JaspritBumrah pic.twitter.com/DHky72zm1T
— Aakash Srivastava (@Cursedbuoy) September 23, 2022