గోవా: ఇండియన్ టీమ్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సోమవారమే పెళ్లి చేసుకోబోతున్నాడు. టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్‌తో అతను ఏడు అడుగులు వేయనున్నాడు. గోవాలో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి వధూవరుల సన్నిహితులు కూడా కొంతమంది హాజరు కానున్నట్లు సమాచారం. ఆదివారమే పెళ్లికి ముందు జరగాల్సిన వేడుకలన్నీ పూర్తయినట్లు బుమ్రా సన్నిహితులు వెల్లడించారు. ఇక పెళ్లిలో మొబైల్ ఫోన్ల వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నట్లు వాళ్లు తెలిపారు. కొవిడ్-19 కారణంగా కేవలం 20 మంది సమక్షంలో మాత్రమే బుమ్రా పెళ్లి జరగబోతున్నట్లు ఓ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా బుమ్రా, సంజన సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌తోపాటు టీ20 సిరీస్‌కు దూరంగా ఉండాలని బుమ్రా నిర్ణయించినప్పటి నుంచీ అతని పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. మొదట్లో టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్‌ను అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనీ వార్తలు వచ్చినా.. వీటిని ఆమె తల్లి ఖండించడంతో ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పడింది.