భారత రకం వైరస్ అనడం సరికాదన్న కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్ రకం బీ.1.617ను భారత వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత వేరియంట్ లేదా భారత రకం అనే పదం మీడియా సంస్థలే వాడుతున్నాయని పేర్కొంది. బీ.1.617 రకం వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్టు వచ్చిన వార్తల సందర్భంగా పలు మీడియా సంస్థలు భారత రకం వైరస్ అని తప్పుగా పేర్కొన్నాయని తెలిపింది. డబ్ల్యూహెచ్వో వర్గీకరించిందనే వార్తలో నిజం లేదని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ల విషయంలో డబ్ల్యూహెచ్వో 32 పేజీల నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికలో భారత వేరియంట్ అనే పదం ఎక్కడా లేదని వెల్లడించింది. భారత వేరియంట్ అనే పదం వాడలేదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసిందని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా వైరస్లను దేశాల పేరు మీద గుర్తించే సంప్రదాయం ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో వైరస్ పెచ్చరిల్లిన తొలినాళ్లల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వూహాన్ వైరస్, చైనా వైరస్ అని పిలవడంపై వివాదం చెలరేగింది. అప్పట్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి ప్రకటనే చేయాల్సి వచ్చింది.