e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News ఇదేనా బీజేపీ తీరు!

ఇదేనా బీజేపీ తీరు!

ఇదేనా బీజేపీ తీరు!

హైద‌రాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్ట‌డ‌మే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్ర‌భుత్వం తీరుగా ఉంది. త‌మ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ను క‌న్న‌త‌ల్లిలా, ఇత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ను స‌వితి త‌ల్లిలా చూస్తోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఎన్నో సంఘ‌ట‌న‌లు రుజువులుగా ఉన్న‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క‌లోని ఎగువ భ‌ద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్ర‌క‌టించడం తాజా ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

దేశంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదు..

నూత‌నంగా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రంలో బీడు బారిన భూముల‌కు జ‌ల సిరులను మ‌ళ్లించే బృహ‌త్ సంక‌ల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం య‌జ్ఞాన్ని త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌ను భ‌రిస్తూ అన‌తి కాలంలోనే ప్రాజెక్టును విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఈ క్ర‌మంలో ఏపీలోని పొల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్ర‌క‌టించిన‌ట్లుగా తెలంగాణ‌లోని కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్, అప్ప‌టి జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రిగా ఉన్న హ‌రీశ్‌రావు కేంద్రానికి ఎన్నోమార్లు విజ్ఞ‌ప్తి చేశారు. పార్లమెంట్ స‌మావేశాల్లో సైతం మ‌న‌ సభ్యులు కాళేశ్వ‌రంపై అడిగినప్పుడు అప్ప‌టి కేంద్ర జలవనరులశాఖ‌ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. కేంద్రం అటువంటి పాలసీను రద్దు చేసిందని పార్లమెంట్ వేదిక‌గా ప్రకటించారు.

2018 జనవరిలో జ‌రిగిన నదుల అనుసంధానంపై ప్రత్యేక కమిటీ 13వ సమావేశంలోనూ నితిన్ గ‌డ్క‌రీ ఇదే విష‌యాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 16 ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మినహా దేశంలోని ఏ ఇతర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ల మధ్య కెన్‌-బెట్వా లింక్‌పై చర్చ సందర్భంగా ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి ధరం పాల్‌ సింగ్‌, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి టి. హరీశ్‌రావు, కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావల్‌, ఇరిగేష‌న్‌శాఖ ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాల్లో చేపట్టిన భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల‌ను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాల్సిందిగా కోరగా నితిన్‌ గడ్కరీ ఈ నిర్ణయం వెలువరించారు. అవసరమైతే రాష్ర్టాలు బయటి నుంచి అప్పులు తెచ్చుకోవచ్చన్నారు.

మ‌రి ఇదేం తీరు?

అయితే తాజాగా క‌ర్ణాట‌క‌లోని ఎగువ భ‌ద్రా ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా స‌మ్మ‌తి తెలుపుతూ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ఇప్ప‌టికే ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎకనమిక్‌ ఎఫైర్స్‌పై జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎగువ భ‌ద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పిస్తూ తుది అనుమతులు మంజూరు చేయనున్నారు. జాతీయ హోదాతో కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,125 కోట్లు వెచ్చించ‌నుంది. కేంద్రం నిర్ణ‌యంపై క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీ.ఎస్‌. య‌డియూర‌ప్ప ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి, కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా దావనగెరె, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కమగలూరు జిల్లాలోని 2.25 లక్షల హెక్టార్లకు సాగునీరు అంద‌నుంది. 2000లో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రూ.2,813 కోట్ల వ్యయంతో 2003లో పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. కాగా భూ సేకరణ, అటవీశాఖ అనుమతుల జాప్యంతో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది.

అన్నింట్లోనూ తెలంగాణ‌కు అన్యాయం..

గిరిజ‌న యూనివ‌ర్సిటీ స్థాప‌న‌, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం, రాష్ట్రంలోని ఏ ఒక్క ఇరిగేష‌న్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌క‌పోవ‌డం, ఐటీఐఆర్‌ను ర‌ద్దు చేయ‌డం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశంలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు మొద‌టినుంచి మొండిచేయినే చూపిస్తూ వ‌స్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇదేనా బీజేపీ తీరు!

ట్రెండింగ్‌

Advertisement