నమస్తే.. వ్యవసాయానికి అనుబంధంగా పాల వ్యాపారం చేయాలని అనుకుంటున్నా. ఏ జాతి బర్రెలను పెంచుకుంటే మంచిది?
– కుమార్, కరీంనగర్.
ప్రపంచంలో అన్ని బర్రె జాతులలో అత్యధిక పాల దిగుబడిని ఇచ్చేవిగా.. ముర్రా జాతి బర్రెలు ప్రసిద్ధి చెందాయి. ఈ జాతి హరియానాలోని రోహ్తక్, హిస్సార్ జిల్లాలు, పంజాబ్లోని నాభా, పటియాలా జిల్లాలకు చెందింది. స్థానిక పాడిరైతుల పాలిట ఈ పశువు కామధేనువే. అందుకే, అక్కడ దీనిని ‘నల్ల బంగారం’ అని పిలుచుకుంటారు. అధిక వ్యాధి నిరోధకతను కలిగి ఉంటాయి. తెలంగాణ వాతావరణాన్నీ తట్టుకుంటాయి. వీటి సగటు వయసు 11 – 12 సంవత్సరాలు. నాలుగేండ్లకు ఎదకు వస్తుంది. ఈతకు ఈతకూ మధ్య ఏడాదిన్నర సమయం పడుతుంది. సాధారణంగా రోజుకు 10 నుంచి 16 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఈ జాతి పశువుల శరీరం కారు నలుపు రంగులో ఉంటుంది. తల, మెడ భాగం పొడవుగా ఉంటాయి. దిట్టమైన కొమ్ములు ఉండి, రింగు ఆకారంలో లోపలివైపునకు తిరిగి ఉంటాయి. ఈ జాతి బర్రెల పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ముర్రా జాతి దున్నపోతులు 530 – 575 కేజీలు, బర్రెలు 430-500 కేజీల వరకూ బరువు ఉంటాయి. వయసు, లక్షణాలను బట్టి ఒక్కో బర్రె రూ .60 వేల నుంచి రూ .1.5 లక్షల వరకూ ఉంటుంది.