e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News జానకీపురం జానపద కోమలం!

జానకీపురం జానపద కోమలం!


‘పల్లెదనం పల్లెదనంగానే ఉంటే తప్పేంది? అన్ని పాటలూ సినిమాటిక్‌గానే ఉండాల్నా? సినిమావాళ్లయినా, ఇంకొకరైనా రైతు పండించిన అన్నాన్నే తింటున్నరు కదా?
మరి రైతు, సామాన్య జనం పుట్టించిన పాటను సామాన్యులతో, ఒక మహిళా రైతుతో పాడిస్తే తప్పేముంది? సారంగ దరియానే కాదు, అలాంటి వందల పాటలు నా దగ్గర ఉన్నయి.
ఏ సినిమావాళ్లకు కావాలన్నా? ఇస్తాను. కానీ.. ప్రజల పాటను గుంజుకోకండి, అడిగి తీసుకోండి’ అంటున్నది జానకీపురంజానపద కళాకారిణి తొట్టె కోమల.

- Advertisement -

కోమల ఇప్పుడు ఒక ట్రెండింగ్‌. ప్రపంచమే ఆమెవైపు చూస్తున్నది. పల్లె పదాల ఊట చెలిమి లాంటి కోమల పాటల ప్రయాణం ఎట్లా మొదలైంది? ఇంతకూ ‘సారంగ దరియా’ పాటను ఆమెకు ఎవరిచ్చిండ్రు? ప్రజల పాట ఆమె సొంతమెట్లా అవుతుంది? ఏం చేస్తే న్యాయం జరిగినట్టు అని కోమల భావిస్తున్నది?ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
బాపు గుర్తించిండు
అప్పుడు నేను ఆరోతరగతి. బాపుతోని కలిసి పొలం దగ్గరకు పోయిన. చెట్టు కింద కూర్చొని నోటికి వచ్చిన పాటల్లా పాడుతున్నా. నాయిన చేనులో మందు కొడుతున్నడు. చూసీ చూడనట్లే ఉన్నడు. నేనూ నా లోకంలో ఉన్నా. ‘గ్యాంగోళ్లమండీ మేం బాబు.. మేం గరీబోల్లమండీ బాబు’ అనే పాట పాడిన. నాయినకు వినిపించిన. ‘ఏంది బిడ్డా మల్లొకసారి పాడు’ అని నాతోటి పాడించిండు. నేను హుషారుగా పాడిన. ఆయన మస్తు సంబురపడ్డడు. ‘ఎక్కడిది బిడ్డా నీకు ఈ పాట’ అని అడిగిండు. ‘టేప్‌ రికాట్‌ల విన్న బాపూ’ అని చెప్పిన. అప్పుడు నాయినొక మాటన్నడు. ‘బిడ్డా ఆ పాటకు నీకు అర్థం తెలుసో లేదో నాకైతే తెల్వదుగానీ.. మన పాటనే పాడినవ్‌రా. మంచిగ పాడుతున్నవ్‌. పాడుతా అనే ఖాయిష్‌ ఉంటే అసొంటి పాటలు పాడు బిడ్డా’ అన్నడు. ‘పాడితే ఏమొస్తది బాపూ’ అని నేను ప్రశ్నించిన. ‘మంచి పేరొస్తది. పదిమందిల గుర్తింపొస్తది. మనసు తుర్తిగుంటదిరా’ అని బాపు నాతోటి అన్న మాటలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చినయి. తర్వాత తెలిసింది ఆ పాటను గద్దరన్న పాడిండు అని. నా గొంతు నుంచి వచ్చిన మొదటి పాట ఇదే.
సార్లు ప్రోత్సహించిండ్రు
నాన్న నద్దునూరి భిక్షపతి, అమ్మ సోమలక్ష్మి. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె ఊరు మాది. కొద్దిపాటి పొలంలో ఎవుసాయెం చేసుకుంట మమ్ములను పెంచిండ్రు అమ్మానాయిన. నాయినిచ్చిన ధైర్యంతోటి రకరకాల పాటలు పాడుతుండేదాన్ని. ఇంట్లో టేప్‌రికార్డర్‌ ఉంది కాబట్టి తీరొక్క క్యాసెట్‌ వేసుకొని పాటలు వింటుండేదాన్ని. అట్లా చిన్నప్పుడే నాకు పాటతో దోస్తానా కుదిరింది. స్కూల్లో ప్రతీ శనివారం పాటల ప్రోగ్రామ్‌ ఉంటుండె. బాపు గుర్తించిన నా పాటను జనాలకు తెలిసేటట్లు జేసింది మాత్రం మా సార్లు అప్పయ్య, కూన భద్రాద్రి. ‘కోమలా నువ్వు బాగా పాడుతవ్‌. చాలా స్వచ్ఛంగా ఉంటది నువ్వు పాడుతుంటే’ అని అప్పయ్య సారు మొదాలు నన్ను ఎంకరేజ్‌ చేసిండ్రు. ‘ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లీ’ అనే పాటను స్కూల్లో పాడినప్పుడు స్కూలంతా దద్దరిల్లిపోయింది. ‘నువ్వు జానపదాన్ని విడువొద్దు. అది నీతోటి ఉంటే నువ్వు చాలా ఎత్తుకు ఎదుగుతవు’ అని దీవించిండ్రు సార్‌ కూన భద్రాద్రి.
అమ్మమ్మ ఇచ్చిన పాట
అది 2008. ‘పొలంలో నాట్లేస్తున్నం. బడి అయిపోయినంక రారా బుజ్జీ’ అని అమ్మ అన్నది. బడి అయిపోయినంక నేను పొలం కాడికి పోయిన. నాట్లేసుకుంట అమ్మలక్కలు పాటలు పాడుతున్నరు. నేను ఒరంమీద కూసొని వింటున్నా. మా అమ్మమ్మ వెంకమ్మ ఓ పాట అందుకుంది. ‘దాని కుడీభుజం మీద కడువా.. దాని కుత్తెపు రైకెలు మెరియా.. అది రమ్మంటే రాదుర చెలియా.. దానిపేరే సారంగ దరియా’ అనేది ఆ పాట. ఆమె పాడే విధానం నన్ను ఆకర్షించింది. ‘అమ్మమ్మా ఒకసారి మల్లా పాడవా’ అని అడిగి పాడించుకున్నా. తర్వాత ఇంటికొచ్చినంకా మల్లొకసారి పాడించి, దానిని రాసిపెట్టుకున్నా. అప్పుడు అమ్మమ్మ ఆ పాటకున్న అర్థం చెప్పింది. అదొక పల్లెటూరి అమ్మాయికి సంబంధించిన పాట. ఆడబిడ్డ పవిత్రతను తెలియజేసే పాట అది. అట్లాంటి పాటలు నేను ఎన్నో అమ్మమ్మ దగ్గర సేకరించిన. పాటతో మొదలువెట్టిన నా ప్రయాణంలో నాకు ఎక్కువగా ఉపయోగపడ్డవీ, నాకు గుర్తింపు తీసుకొచ్చినవీ అమ్మమ్మ తాన తీసుకున్న పాటలే.
‘రేలారే రేలా’తో
చదువుకు ఎంత ప్రాధాన్యం ఇచ్చానో, పాటకు కూడా అంతే విలువ ఇచ్చిన. దొరికిన ఏ అవకాశాన్నీ కూడా వదులుకోకుండా పల్లె పదాలను పాడుతుండేదాన్ని. అట్లా నాలోని ఆసక్తిని గుర్తించి ఇంటర్‌లో సోమయ్య సార్‌, డిగ్రీలో మధుసార్‌ ప్రోత్సహించిండ్రు. నేను బీకాం కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన. పేద కుటుంబమే అయినా మా తల్లిదండ్రులు నన్ను బాగనే చదివించిండ్రు. నేను మొదటిసారిగా టీవీల కనిపించింది టీవీ9లో. ఆర్పీ పట్నాయక్‌ సార్‌ జడ్జీగా ఓ ప్రోగ్రామ్‌ చేసిండ్రు అప్పట్లో. ‘కర్రెకోడి గరంమసాలా’ అనే పాటకు అందరూ ‘శభాష్‌’ అన్నరు. దాని తర్వాత హెచ్‌ఎంటీవీల ఒక ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యాను. అక్కడనే తొలిసారిగా ‘సారంగ దరియా’ పాడిన. కానీ అంతపేరు రాలేదు ఆ పాటకు. ఎప్పుడైతే టీన్యూస్‌ల ‘రేలారే రేలా’ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యిన్నో అప్పుడు ‘సారంగ దరియా’ పాట జనాల్లోకి వెళ్లింది. అప్పుడు సుద్దాల అశోక్‌తేజ సార్‌ జడ్జీగా ఉన్నరు. మస్తు పాడినవ్‌ అని మెచ్చుకొని ఈ పాటను నేను ఎక్కడికో తీసుకెళ్తా అని మాటిచ్చిండ్రు కూడా.
భర్త అర్థం చేసుకుండు
సారంగ దరియా పాటతో నాకంటూ కొంత గుర్తింపు వచ్చింది. పాటలతో ఎట్లనో అట్లా ముందుకెళ్దాం అనుకుంటున్న సమయంలోనే పెండ్లి గురించి ముచ్చట వచ్చింది. పెండ్లి వెనక కూడా ఓ కారణం ఉంది. మాది పేద కుటుంబం. అందునా ఇద్దరం ఆడపిల్లలమాయె. ‘ఎద్దు, ఎవుసం బాగనే ఉంది చేసుకో బిడ్డా’ అన్నరు అమ్మానాయిన.
వాళ్ల బాధను అర్థంచేసుకొని నేను ‘ఓకే’ చెప్పినా. 2014లో నాకు పెండ్లయింది. మా ఆయన పేరు తొట్టె మహేందర్‌. ఎంబీఏ దాకా చదువుకుండు. కానీ కుటుంబ బాధ్యతల కారణంగా ఊళ్లెనే ఉంటూ ఎవుసాయం చేస్తుండు. మా అత్తగారి ఊరు ధర్మసాగర్‌ మండలం జానకీపురం. నేను ఇంటికి పెద్ద కోడల్ని. మా ఆయన మీద ఎంత బాధ్యత ఉందో, నాపైనా అంతే ఉంది. రేలారే రేలాలో నేను పాడినప్పుడు మా ఆయన.. ‘ఈ పిల్ల ఎవరోగానీ.. పెండ్లంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలె’ అనుకున్నడంట. మా ఆయన నన్ను బాగా అర్థం చేసుకుండు కాబట్టే, పాటతో నేను ఇంకా ప్రయాణం చేయగలుగుతున్నా.
నన్ను అడగలేదసలు
ఒకసారి మానుకోట ప్రసాదన్న ‘ఏం చెల్లే.. ఎవుసంలనే బిజీగా ఉంటవా? నీతాన మంచి మంచి పాటలుంటయి కదా? పాడొచ్చు కదా?’ అని నన్ను మొదటగా అజయ్‌ కోడం అన్న చానల్‌కు పాడించిండు. అట్లా నేను యూట్యూబ్‌ల పాడిన మొదటి పాట ‘చిటికెనేలుకు తేలుకొడితే చింగులు జిల్‌జింకలాడె’. దీంట్లె చాలా అర్థం ఉంటది. పెట్టిన కొద్దికాలానికే 2 మిలియన్లు దాటింది. మేకల భరత్‌ అన్న మంచి సంగీతం ఇచ్చిండు. ఈ పాటను నేను రజితక్క దగ్గర సేకరించిన. అక్కడి నుంచి ఇక ఆగకుంటా పాటలు పాడ్తనే ఉన్నా. ఇప్పటివరకు 10కి పైగా యూట్యూబ్‌లో పాటలు పాడిన. పాడిన ప్రతీ పాట నాకు మంచి పేరే తీసుకొచ్చింది. అట్లా ‘సారంగ దరియా పాట’ కూడా అమూల్య మ్యూజిక్‌ వాళ్లు వేసిండ్రు. ‘సేకరణ’ అని నా పేరు పెట్టిండ్రు. కానీ శేఖర్‌ కమ్ముల సార్‌ ‘లవ్‌ స్టోరీ’ సినిమాల మాత్రం ఈ పాటను వాడుకొని ‘సేకరణ’ అనీ వేయలేదు. పైగా ఈ పాటను మా గురువుగారు సుద్దాల అశోక్‌ తేజ సార్‌ రాసినట్టు పెట్టుకుండ్రు. ‘నీ పాటను ఎక్కడికో తీసుకెళ్తా కోమల’ అని చెప్పిన సారు, నన్ను సంప్రదించకపోవడం చాలా బాధనిపించింది.
చానా పాటలున్నయి
నాకు చాలా సంతోషం కలిగించింది ఈ పాటనే. ఇప్పుడు నన్ను బాగా బాధపెడుతున్నది కూడా ఈ పాటనే. సేకరించుకున్నది ఎవరన్నా పాడుకోవచ్చు అంటున్నరు కదా? ఒక్కొక్కరు ఒక్కో పాటను సేకరించుకొని పాడుతరు. వాళ్లు సేకరించుకున్న పాటను, వాళ్ల అనుమతి లేకుండా నేను పాడితే ఊరుకుంటారా? ఇదీ అంతే. ఇన్నేండ్ల నుంచి ఏ ఒక్క సందర్భంలో, ఏ ఒక్క సినిమాలో ఈ పాటను ఎందుకు రాయలేదు? పాడించలేదు? ‘సారంగ దరియా’ పాటతో ప్రపంచమే నాదిక్కు చూస్తున్నది. ఇసొంటివి నా దగ్గర వందకు పైగా అద్భుతమైన పాటలున్నయి. సినిమాల్లో పెట్టాలనుకునేవాళ్లు అడిగితే నా పాటలను ఇవ్వడానికి, పాడటానికి
నేను రెడీగా ఉన్నా.
అమ్మలక్కల పాటలే

పొలం దగ్గర పనులు చేయించుకుంటా బిజీ అయిపోయినా. పాట పాడటం కొంతవరకు తగ్గింది. కానీ పాట సేకరణ మాత్రం ఆగిపోలేదు. పగటీలి అన్నం తినేటప్పుడు కూరలు, అన్నమే కాదూ, పాటలూ పంచుకునేటోళ్లం. అట్లా వాళ్లతోటి తీరొక్క పాట పాడించేదాన్ని. ఇంటికెల్లినంక వాటిని చక్కగా అల్లి, మల్లతెల్లారి పొలానికి వెళ్లినప్పుడు వినిపించేదాన్ని. అప్పుడు వాళ్లు పరేషాన్‌ అయ్యేటోళ్లు. ‘నిన్న చెప్తే ఇప్పుడే నేర్చుకున్నవా’ అంటుండె. పని అయిపోయినంక ‘ఇంటికెళ్లాలనిపిస్తలేదు కోమలా. నీ పాటలే వినాలనిపిస్తాంది’ అనేటోళ్లు. ‘అంతో ఇంతో భూమి ఉంది నిమ్మలంగా ఎవుసాయెం చేసుకొని ఉండక ఏందీ లొల్లీ.. ఎప్పుడూ పాటలు పాటలు అని తిరుగుతవు’ అంటుండె కొందరు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. నాకు సంతోషం కలిగినా, బాధ అనిపించినా పాట రూపంలోనే చెప్పుకొనేదాన్ని. అలా ‘ఆడపిల్ల బతుకు అమవాస్య చీకటాయె’ పాట రాసుకున్నా. నాకు మంచి పేరు
తీసుకొచ్చింది ఈ పాట.
-దాయి శ్రీశైలం
గొట్టె వెంకన్న

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement