ఆవిష్కరణల దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం
ఇన్స్పైర్-మానక్ పేరుతో ప్రయోగాలు
దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలకు అవకాశం
దరఖాస్తులకు సెప్టెంబర్ 30వరకు గడువు
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసి, వారిని కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్స్పైర్- మానక్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆరో నుంచి 10వ తరగతి చదువుతున్న వారిని అర్హులుగా నిర్ణయించారు. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 15 : దేశవ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనకు పదును పెట్టి విజ్ఞాన పురగోతి ని సాధించేందుకు, ప్రయోగాలు, ఆవిష్కరణలు దిశగా మళ్లించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘ఇన్స్పైర్-మానాక్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తున్నది. ఇది వరకు ఉన్న ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ఇన్స్పైర్ అవార్డు-మానక్గా పునరుద్ధరించి 5లక్షల పాఠశాలల నుంచి 10లక్షల ఆవిష్కరణలు చేయిస్తారు. వీటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రతి విద్యార్థికి రూ. 10వేల చొప్పున చెల్లిస్తారు. 10నుంచి 15 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఆరో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులుగా నిర్ణయించారు.
ఒక పాఠశాల నుంచి రెండు లేదా మూడు వరకు నామినేషన్లు పంపవచ్చు. విద్యార్థుల ఫొటోలు, ప్రాజెక్టు వివరాలు వీడియో లు, చిత్రాలు, యూ-డైస్కోడ్, పాఠశాల ఈ మెయిల్, విద్యార్థి ఆధార్‌నంబర్, బ్యాంకు ఖాతా, గైడ్, ప్రధానోపాధ్యాయుల ఫోన్ నంబర్లు అవసరం. అవార్డు విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ చేపడుతున్న ఈ పథకంలో భాగంగా 2022-23 సంవత్సరం కోసం ప్రతిపాదనల ఆహ్వానాన్ని ప్రకటించారు. జూలై 1నుంచి సెప్టెంబర్ 30లోగా ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో వెబ్సైట్ ద్వారా ప్రతిపాదనలు పంపించాలి.
ప్రోత్సాహకాలు..
ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. వీరు ప్రాథమికంగా ఎంపిక చేసిన విద్యార్థి వ్యక్తిగత ఖాతాకు రూ. 10 వేలు జమ చేస్తారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైతే రూ. 25వేలు, జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాజెక్ట్‌గా ఎంపికైతే రూ. 40నుంచి 60వేల నగదు ప్రధానం చేస్తారు. ఆ పరిశోధనపై మేధో సంపత్తి హక్కులు సైతం కల్పిస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.
దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30వరకు
ఇన్స్పైర్ అవార్డు మానక్ 2022-23 విద్యా సంవత్సరానికి ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా www.inspireawards.dst.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లక్ష్యం నెరవేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రోత్సహించాలి. సృజనాత్మకమైన ఆలోచనలు వాటి పరిష్కారాలను కనుగోనే దిశలో యోచించాలి. వినూత్న ఆలోచనలతో మన జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేకతను దాటేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలి. జాతీయ స్థాయిలో ప్రతిచాటిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. ఏవేని సందేహాలు ఉంటే 8328599 157ను సంప్రదించండి.
– జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్