న్యూఢిల్లీ, నవంబర్ 13 : భారత దేశ ద్రవ్యోల్బణం (Inflation) అక్టోబర్లో రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 0.25 శాతం నమోదైంది. అయితే ద్రవ్యోల్బణం ఇంత తక్కువకు పడిపోయినా కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం మండిపోతున్నాయి. సాధారణంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా పెరగకుండా స్థిరంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూరగాయలు, పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలు సుమారు 2 శాతం ధరలు పెరిగాయి. చాలామంది ఇష్టంగా తినే బఠాణీల ధర 12 శాతం పెరిగింది. చికెన్ ధర 1 శాతం, గుడ్లపై 0.5 శాతం పెరిగింది. ఇక పండ్ల విషయానికొస్తే అనాస పండు 6.1 శాతం పెరుగగా, ఆపిల్ ధరలు మాత్రం 10 శాతం తగ్గాయి.
అలాగే బంగారం 12.5 శాతం, వెండి 21.7 శాతం పెరిగాయి. క్యాబేజ్ 4 శాతం, బంగాళదుంప 1.3 శాతం పెరుగగా, టమాటాలు 10 శాతం, ఉల్లిగడ్డలు 3.5 శాతం తగ్గాయి. ఇక వంట నూనెల విషయానికొస్తే.. ఆవ, వేరుశనగ, రిఫైన్డ్ అయిల్ ధరలు స్పల్పంగా తగ్గాయి. నెయ్యి ధర కూడా స్వల్పంగా తగ్గింది. చక్కెర ధరలు పాక్షికంగా పెరగ్గా, టీ, కాఫీల ధరలు స్థిరంగా ఉన్నాయి. హెయిర్ ఆయిల్, షాంపూల ధరలు 0.3 శాతం పెరిగాయి. ఇళ్ల అద్దెలను పరిశీలిస్తే నెలనెలకు 0.9 శాతం పెరుగుతున్నది. అదే సమయంలో ఫ్లాట్ నిర్వహణ, విద్యుత్, ఎల్పీజీ ఖర్చులు స్థిరంగా ఉన్నాయి. రికార్డు కనిష్ట స్థాయికి భారత ద్రవ్యోల్బణం నమోదైన విషయాన్ని తాము మీడియా ద్వారా చూశామని, అయితే వాటి ఫలితాలు తాము అందుకున్నట్టు కన్పించడం లేదని పలువురు పౌరులు ఫిర్యాదు చేశారు.