e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home స్పోర్ట్స్ అక్షర్‌ అశ్విన్‌ ఆడుకున్నారు

అక్షర్‌ అశ్విన్‌ ఆడుకున్నారు

  • గులాబీ బంతితో తిప్పేసిన భారత స్పిన్నర్లు
  • ఆరు వికెట్లతో అక్షర్‌ విజృంభణ
  • 112 పరుగులకే ఇంగ్లండ్‌ ఢమాల్‌.. భారత్‌ 99/3
అక్షర్‌ అశ్విన్‌ ఆడుకున్నారు


ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో తొలి అడుగును భారత్‌ ఘనంగా వేసింది. ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా పేరు మార్చిన మొతెరాలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ గులాబీ బంతిని గింగిరాలు తిప్పడంతో ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. డే అండ్‌ నైట్‌ టెస్టు తొలి రోజే వైవిధ్యమైన బంతులతో యువ అక్షర్‌ ఆరు వికెట్లతో ఇంగ్లిష్‌ జట్టు పతనాన్ని శాసిస్తే.. అశ్విన్‌ అనుభవాన్ని రంగరించి దెబ్బకొట్టాడు. దీంతో స్టేడియంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎల్‌ఈడీ లైట్లు వెలిగీ వెలుగక ముందే ఇంగ్లండ్‌ 112 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం పరీక్ష పెట్టిన పిచ్‌పై రోహిత్‌ శర్మ అజేయ అర్ధశతకంతో సమర్థంగా ఆడడంతో భారత్‌ పటిష్ఠ స్థితిలో నిలిచింది.

అహ్మదాబాద్‌: భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (6/38), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/26) రెచ్చిపోవడంతో డే అండ్‌ నైట్‌ టెస్టు తొలి రోజు రెండు సెషన్లలోనే ఇంగ్లండ్‌ చేతులెత్తేసింది. గులాబీ బంతితో పోటీనిస్తామని ఆశించిన రూట్‌సేన ఆశలు ఆరంభంలోనే ఆవిరయ్యాయి. అశ్విన్‌, అక్షర్‌ విజృంభించడంతో బుధవారం ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది. జాక్‌ క్రాలీ (84 బంతుల్లో 53; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా.. మరెవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేక నానా కష్టాలు పడ్డారు. అనంతరం రోహిత్‌ శర్మ (82 బంతుల్లో 57 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధశతకం బాదడంతో మూడు వికెట్లకు 99 పరుగుల వద్ద భారత్‌ తొలి రోజును ముగించింది. ఇంగ్లిష్‌ జట్టు స్కోరుకు 13 పరుగుల దూరంలో టీమ్‌ఇండియా ఉండగా.. రోహిత్‌తో పాటు క్రీజులో అజింక్య రహానే (1) ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌కు రెండు వికెట్లు దక్కగా.. ఆర్చర్‌ ఓ వికెట్‌ తీశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరేందుకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం.
కొనసాగిన పతనం
విరామం తర్వాత కూడా భారత స్పిన్నర్ల హవా కొనసాగడంతో ఇంగ్లండ్‌ పతనం మరింత వేగిరమైంది. అద్భుతమైన బంతితో పోప్‌ (1)ను అశ్విన్‌ బౌల్డ్‌ చేయగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (6)ను అక్షర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూ తీసుకున్నా స్టోక్స్‌కు అదృష్టం దక్కకపోవడంతో 81 పరుగులకే ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జోఫ్రా ఆర్చర్‌ (11), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3)తో పాటు ఓ ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన ఫోక్స్‌ (12)ను కూడా ఔట్‌ చేసి అక్షర్‌.. రూట్‌సేన కథ ముగిస్తే.. మధ్యలో లీచ్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 48.4 ఓవర్లలోనే 112 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ చాపచుట్టేసింది. కాగా వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకున్న కోహ్లీ.. అతడితో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడం కొసమెరుపు. మరోవైపు ఇంగ్లండ్‌ ఒక్క స్పిన్నర్‌తోనే బరిలోకి దిగింది.
అక్షర్‌, అశ్విన్‌ మ్యాజిక్
గులాబీ బంతితో తొలి రోజు పిచ్‌పై భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ మాయాజాలం చేశారు. పేస్‌కు అనుకూలిస్తుందని అంచనాలు వెలువడిన పిచ్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ప్రత్యర్థి రూట్‌సేన 112 పరుగులకే కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ మూడో ఓవర్‌లోనే సూపర్‌ ఔట్‌ స్వింగర్‌తో డామ్‌ సిబ్లీ (0)ని డకౌట్‌ చేసి ఇంగ్లిష్‌ జట్టు వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో (0) కథను లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ వెంటనే ముగించాడు. సమర్థంగా ఆడుతున్న జాక్‌ క్రాలీతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిని కెప్టెన్‌ రూట్‌ (17) భుజానికెత్తుకున్నాడు. ఇద్దరూ సాధికారికంగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్న సమయంలో అశ్విన్‌ చక్కటి బంతితో రూట్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడిన క్రాలీ 68 బంతుల్లో అర్ధశతకంతో అదరగొట్టాడు. కాసేపటికే అక్షర్‌ స్పిన్‌ ఉచ్చుతో అతడు వికెట్ల ముందుదొరికిపోవడంతో ఇంగ్లండ్‌ 81 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తొలి సెషన్‌ను ముగించింది.
ప్రేక్షకుల సందడి
పునర్నిర్మాణం తర్వాత లక్షా 32 వేల మంది సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా అవతరించిన మొతెరాలో తొలిరోజు ఆటలో ప్రేక్షకులు భారీ సంఖ్యలో సందడి చేశారు. కరోనా కారణంగా 50శాతం మంది ప్రేక్షకులనే అనుమతించినా పదుల వేల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మారుస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో కలిసి ఆయన అభిమానులకు అభివాదం చేశారు.
నిలిచిన రోహిత్

అక్షర్‌ అశ్విన్‌ ఆడుకున్నారు

తొలి రోజే కఠినతరంగా మారిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ పరీక్షను ఎదుర్కొన్నారు. ఇంగ్లండ్‌ పేసర్లు ఆండర్సన్‌, బ్రాడ్‌ స్వింగ్‌ బంతులకు ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ కాసేపు తడబడ్డారు. తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడిన గిల్‌(11)ను ఆర్చర్‌ 15వ ఓవర్లో పెవిలియన్‌కు పంపడంతో 33 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. వెనువెంటనే పుజారా(0)ను లీచ్‌ డకౌట్‌ చేయడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత రోహిత్‌, కెప్టెన్‌ కోహ్లీ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇంగ్లండ్‌ ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాధికారికంగా ఆడారు. ఓ ఎండ్‌లో రోహిత్‌ దూకుడైన బ్యాటింగ్‌తో రెచ్చిపోతే కోహ్లీ జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో 63 బంతుల్లోనే రోహిత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక.. రోజు ముగిసే ఓ ఓవర్‌ ముందు లీచ్‌ వేసిన బంతిని వికెట్లపై ఆడుకున్న కోహ్లీ పెవిలియన్‌ బాటపట్టడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
అంపైర్లతో ఇంగ్లండ్‌ వాదన
థర్డ్‌ అంపైర్‌ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు తమకు ప్రతికూలంగా రావడంతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ సహా మరికొందరు ఆటగాళ్లు ఫీల్డ్‌ అంపైర్లతో వాదించారు. గిల్‌ కొట్టిన బంతిని నేల తాకుతూ పట్టిన స్టోక్స్‌.. రివ్యూలో నాటౌట్‌గా తేలడంతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్‌ శర్మ స్టంపింగ్‌ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌కు వెళ్లగా ఫోక్స్‌ వికెట్లను గిరాటేసే సరికి హిట్‌మ్యాన్‌ క్రీజులోకి వచ్చినట్టు తేలింది. ఈ నిర్ణయంతో అసహానానికి గురైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.

2 దిగ్గజ కపిల్‌ దేవ్‌ తర్వాత భారత్‌ తరఫున 100 టెస్టులు ఆడిన రెండో పేసర్‌ ఇషాంత్‌ శర్మ చరిత్రకెక్కాడు.
3 కెరీర్‌లో తొలి రెండు టెస్టుల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో భారత బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌ రికార్డు సృష్టించాడు. నరేంద్ర హిర్వానీ, మహమ్మద్‌ నిసార్‌ తర్వాత అక్షర్‌ ఈ ఘనత సాధించాడు.

స్కోరు బోర్డు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: జాక్‌ క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) అక్షర్‌ 53, సిబ్లీ (సి) రోహిత్‌ (బి) ఇషాంత్‌ 0, బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) అక్షర్‌ 0, జో రూట్‌ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్‌ 17, స్టోక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) అక్షర్‌ 6, పోప్‌ (బౌల్డ్‌) అశ్విన్‌ 1, ఫోక్స్‌ (బౌల్డ్‌) పటేల్‌ 12, ఆర్చర్‌ (బౌల్డ్‌) అక్షర్‌ 11, జాక్‌ లీచ్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 3, బ్రాడ్‌ (సి) బుమ్రా (బి) పటేల్‌ 3, అండర్సన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6. మొత్తం 48.4 ఓవర్లలో 112 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-2, 2-27, 3-74, 4-80, 5-81, 6-81, 7-93, 8-98, 9-105, 10-112; బౌలింగ్‌: ఇషాంత్‌ 5-1-26-1, బుమ్రా 6-3-19-0, అక్షర్‌ 21.4-6-38-6, అశ్విన్‌ 16-6-26-3.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (నాటౌట్‌) 57, గిల్‌ (సి) క్రాలీ (బి) ఆర్చర్‌ 11, పుజార (ఎల్బీడబ్ల్యూ) లీచ్‌ 0, కోహ్లీ (బౌల్డ్‌) లీచ్‌ 27, రహానే (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు : 3. మొత్తం 33 ఓవర్లలో 99/3. వికెట్ల పతనం: 1-33, 2-34, 3-98. బౌలింగ్‌: అండర్సన్‌ 9-6-11-0, బ్రాడ్‌ 6-1-16-0, ఆర్చర్‌ 5-2-24-1, లీచ్‌ 10-1-27-2, స్టోక్స్‌ 3-0-19-0.

Advertisement
అక్షర్‌ అశ్విన్‌ ఆడుకున్నారు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement