ఆసియాకప్‌లో టీమ్ఇండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. ఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ మినహా తక్కినవాళ్లంతా బ్యాట్‌తో విఫలం కాగా.. బౌలర్లు అద్భుతాలు చేయలేకపోయారు.
వరుసగా రెండో మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన భువనేశ్వర టీమ్ఇండియాకు విలన్‌గా నిలిస్తే.. గత మ్యాచ్‌లో క్యాచ్ మిస్ చేసి విమర్శలపాలైన అర్శ్‌దీప్ తన తప్పులు సరిదిద్దుకోలేకపోయాడు. ఇక నామమాత్ర పోరులో గురువారం అఫ్గాన్‌తో రోహిత్ సేన తలపడనుంది!
దుబాయ్: పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆసియా కప్‌ను రిహార్సల్స్‌గా నియోగించుకోవాలనుకున్న టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోటు పాట్లను సరిదిద్దుకుందామనుకున్న రోహిత్ సేనకు.. ఈ టోర్నీతో కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఫైనల్ చేరే చాన్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి అధికారికంగా మాత్రమే పోటీలో ఉన్న టీమ్ఇండియా తుదిపోరుకు అర్హత సాధించాలంటే అద్భుతం జరుగాల్సిందే. మంగళవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (34) ఫర్వాలేదనిపించాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో రాణించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) డకౌట్ కాగా.. వరుసగా మూడో మ్యాచ్‌లో రాహుల్ (6) నిరాశ పరిచాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా (17), రిషబ్ పంత్ (17) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. దీపక్ హుడా (3) లక్కీ చాన్స్‌ను వినియోగించుకోలేకపోయాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ (15 నాటౌట్; ఒక సిక్సర్) ఆఖర్లో విలువైన పరుగులు రాబట్టాడు. లంక బౌలర్లలో మధుషనక మూడు, చమిక, దసున్ షనక చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్లు పతుమ్ నిసాంక (52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుషాల్ మెండిస్ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకుంటే.. చివర్లో కెప్టెన్ దసున్ షనక (18 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), భానుక రాజపక్స (25 నాటౌట్; 2 సిక్సర్లు) ఒత్తిడికి ఎదురు నిలిచి జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు. దసున్ షనకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. టీమ్ఇండియా తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. యువ పేసర్ అవేశ్ ఖాన్.. అనారోగ్యంతో ఆసియాకప్‌నకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దీపక్ చాహర్‌ను జట్టులో చేర్చారు.
భారత్: రాహుల్ (ఎల్బీ) మహేశ్ 6, రోహిత్ (సి) నిసాంక (బి) చమిక 72, కోహ్లీ (బి) మధుషనక 0, సూర్యకుమార్ (సి) మహేశ్ (బి) షనక 34, పాండ్యా (సి) నిసాంక (బి) షనక 17, పంత్ (సి) నిసాంక (బి) మధుషనక 17, దీపక్ హుడా (బి) మధుషనక 3, అశ్విన్ (నాటౌట్) 15, భువనేశ్వర్ (బి) చమిక 0, అర్శ్‌దీప్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 173/8. వికెట్ల పతనం: 1-11, 2-13, 3-110, 4-119, 5-149, 6-157, 7-158, 8-164, బౌలింగ్: మధుషనక 4-0-24-3, మహేశ్ 4-0-29-1, చమిక 4-0-27-2, ఫెర్నాండో 2-0-28-0, హసరంగ 4-0-39-0, షనక 2-0-26-2.
శ్రీలంక: నిసాంక (సి) రోహిత్ (బి) చాహల్ 52, కుషాల్ మెండిస్ (ఎల్బీ) చాహల్ 57, అసలంక (సి) సూర్యకుమార్ (బి) చాహల్ 0, గుణతిలక (సి) రాహుల్ (బి) అశ్విన్ 1, భానుక (నాటౌట్) 25, షనక (నాటౌట్) 33, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.5 ఓవర్లలో 174/4. వికెట్ల పతనం: 1-97, 2-97, 3-110, 4-110, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-30-0, అర్శ్‌దీప్ 3.5-0-40-0, హార్దిక్ 4-0-35-0, చాహల్ 4-0-34-3, అశ్విన్ 4-0-32-1.