న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలక ముందడుగు పడింది. దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ‘సెర్వావ్యాక్’ను అవిష్కరించారు. దీన్ని మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని, ప్రజలకు అందుబాటు ధరల్లో (రూ.200-400) ఉంచుతామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా గురువారం ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత వ్యాక్సిన్ తుది ధరను నిర్ణయిస్తామని తెలిపారు.
టీకాపై మంత్రి హరీశ్‌రావు హర్షం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘సెర్వావ్యాక్’ టీకాపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. టీకాను ఆవిష్కరించిన సీరం ఇన్స్టిట్యూట్ను, కేంద్ర బయోటెక్నాలజీ విభాగాన్ని అభినందించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చుతుందని, తద్వారా 9-14 ఏండ్ల మధ్యవయసున్న బాలికలకు ప్రయోజనం కల్పిస్తుందని ఆకాంక్షించారు.