‘స్వతంత్ర సమరయోధుల త్యాగఫలితంగానే స్వతంత్ర భారత్ ఆవిర్భవించింది.. వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.. సీఎం కేసీఆర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.. కొత్తగా 28,427 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశారు..’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తున్నదని గుర్తుచేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో సోమవారం జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలి స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి మరింత వేగవంతమైందని అన్నారు.
భద్రాద్రి జిల్లాలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, జిల్లా సస్యశ్యామలం కోసం సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. భూమినే నమ్ముకున్న రైతన్నలకు పంటల సాగు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వమే సాయం అందిస్తోందని అన్నారు. రైతుబంధు పథకం కింద జిల్లాలో 34,633 మంది రైతులకు రూ.205 కోట్లను ప్రభుత్వం అందించిందన్నారు. ‘మన బడి’లో భాగంగా మొదటి విడతగా 638 స్కూళ్లు ఎంపిక చేయగా 345 పాఠశాలల్లో అభివృద్ధి పనులు మొదలుపెట్టామని వివరించారు. బడిబాట కార్యక్రమం ద్వారా 8,564 మందిని పాఠశాలల్లో చేర్పించామన్నారు.
కొత్తగా 28,427 పింఛన్లు..
ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తాజాగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతరులకు వజ్రోత్సవాల కానుక అందించారన్నారు. ఇప్పటి వరకు ఇచ్చే పింఛన్లతోపాటు మరో 28,427 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశారని, ఆ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనూ జమ చేశారని వివరించారు.
వరదల వేళ అండగా నిలిచి..
మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి గోదావరి వరదలు వచ్చి ప్రజలు సర్వం కోల్పోతే.. రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా భద్రాచలం వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి రూ.1000 కోట్లు ప్రకటించారని, వరద బాధితులకు తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారని వివరించారు. దళితబంధు కింద జిల్లాలో 421 మంది లబ్ధిదారులకు రూ.35.66 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియ పాల్గొన్నారు.