భద్రాచలం, మే 24 : వడదెబ్బ బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందిన వ్యక్తిని అతడి బంధువులు చేతులు, భుజాలపై మోసుకెళ్తున్న అమానవీయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానికులు, వైద్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కండె వెంకన్న (42) ఆదివారం వడదెబ్బకు గురికావడంతో అతడి బంధువులు స్థానిక ఏరియా దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మరణించాడు.
భావోద్వేగానికి గురైన అతడి బంధువులు వెంకన్న మృతదేహాన్ని చేతులు, భుజాలపై మోసుకుంటూ దవాఖాన బయటకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ ఈ దృశ్యాన్ని గమనించి చలించిపోయి.. తన అంబులెన్సులో ఉచితంగా వారి ఇంటికి తీసుకెళ్లాడు. దవాఖాన నుంచి మృతదేహాన్ని చేతులపై మోసుకొచ్చారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దవాఖానపై తీవ్రవిమర్శలు రావడంతో సూపరింటెండెంట్ రామకృష్ణ స్పందించారు. దవాఖాన అంబులెన్స్ వచ్చే వరకు వెంకన్న బంధువులు వేచి ఉండకుండా మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లినట్టు తెలిపారు.