ఆక్ల్యాండ్: వెనకటికి ఒకాయన ఇల్ల కట్టిన తర్వాత వాస్తు నిపుణుడిని పిలిచి చూపించాడట. ఆయన వచ్చి అంతా బాగానే ఉంది కానీ ఇల్లును ఒక మీటరు వెనుకకు జరపాలి అని సలహా ఇచ్చాడట. ఇది జోకు. కానీ న్యూజీల్యాండ్‌లో ఓ భారతీయునికి ఇలాంటి కష్టమే వచ్చిపడింది. రాజధాని ఆక్ ల్యాండ్ లోని పపాకురా ప్రాంతంలో దీపక్ లాల్ ఓ మూడు బెడ్రూముల ఇల్లు కట్టుకున్నారు. దాదాపుగా నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇంతలో పొరుగున ఉన్న సీ-94 అనే డెవలప్ మెంట్ కంపెనీ పిడుగు లాంటి నోటీసు పంపింది.
“అయ్యా తమరు కట్టాల్సిన స్థలానికి, కట్టిన స్థలానికి మీటరు తేడా వచ్చింది. కనుక తమరు ఇల్లును ఓ మీటరు పక్కకు జరపండి లేదా 3,15,000 డాలర్లు (రూ.కోటిన్నర పైచిలుకు) పరిహారంగా చెల్లించండి” అని దాని సారాంశం. ఇప్పుడు లాల్‌కు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదట. ఇల్లు కట్టేపని కాంట్రాక్టుకు ఇచ్చారు. నిర్మాణానికి స్థానిక పురపాలక మండలి ఆమోదం కూడా ఉంది. అయినా ఇదేంది అని వాపోతున్నారు. అంతకుముందు సర్వేయర్ ద్వారా భూమిని గుర్తించే పని కూడా చేశారట. హెచ్ క్యూ డిజైన్స్ అనే కంపెనీ అనుమతులు పొందేవిషయంలో సేవలు అందించింది.
ఇలా రకరకాల పనుల్లో ఎక్కడో తప్పు జరిగింది. సీ-94 డెవలప్ మెంట్ కంపెనీ సత్వరమే సమస్య పరిష్కారం కాకపోతే తాము కట్టిన ఇల్లు అమ్మకం ఆలస్యమవుతుందని అంటున్నది. అందరూ ఒకరి మీద మరొకరు నెపం తోసేసుకుంటున్నారు. మధ్యలో కొత్త ఇంటి లోన్ కిస్తులు కడుతూ, ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దె కడుతూ రెండు భారాలు మోస్తున్న లాల్ మాత్రం కంటి మీద కునుకు లేకుండా సతమతం అవుతున్నారు.