న్యూయర్క్ : తన కండ్లుకప్పి వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్న బాయ్‌ఫ్రెండ్‌ను యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌తో ట్రాక్ చేస్తూ ఆపై అతడిని కడతేర్చిన మహిళ ఉదంతం కలకలం రేపింది. తనను మోసగించిన ప్రియుడి కదలికలను యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌తో పసిగట్టి తన కారుతో అతడిని ఢీకొట్టి అంతమొందించానని అమెరికాకు చెందిన మహిళ వెల్లడించింది. పోయిన వస్తువులను ట్రాక్ చేసేందుకు ఉపకరించే యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ను ట్రాక్ చేసేందుకు ఉపయోగించింది.
అయితే ఈ డివైజ్‌ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. తమ పార్ట్నర్స్పై ఓ కన్నేసి ఉంచేందుకు వీటిని వాడుతున్నారు. ఇక తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేస్తున్నాడని యాపిల్ ఎయిర్‌ట్యాగ్ వాడటంతో కనిపెట్టానని 26 ఏండ్ల గలిన్ మోరిస్ చెప్పుకొచ్చింది. ఈ డివైజ్‌తో అతడి కదలికలను గమనిస్తూ బార్‌కు వెళ్లానని, అక్కడకు వెళ్లగానే తన ప్రియుడు మరో మహిళతో కనిపించాడని తెలిపింది. ఖాళీ వైన్ బాటిల్‌తో మహిళపై దాడి చేసేందుకు ఆమె వెళ్లగా ప్రియుడు ఆండ్రూ స్మిత్ అడ్డుకున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు.
ఆపై బాయ్ఫ్రెండ్పైకి ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి అతడి మరణానికి కారణమైందని స్ధానిక పోలీసులు ధ్రువీకరించారు. ఎయిర్‌ట్యాగ్ ఉపయోగించకుండా ఉంటే స్మిత్ ఎప్పటికీ పట్టుబడేవాడు కాదని చెబుతున్నారు . ఎయిర్‌ట్యాగ్ గురించి యూజర్లు ఇక నుంచీ అప్రమత్తంగా ఉండాలని యాపిల్ కోరింది. టోన్ సీక్వెన్స్‌ను ఉపయోగించి కూడా యూజర్లు ఎయిర్‌ట్యాగ్‌ను గుర్తించవచ్చని బ్లాగ్‌పోస్ట్‌లో యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత వస్తువులను గుర్తించేందుకు ప్రజలకు వెసులుబాటుగా ఉండేలా ఎయిర్‌ట్యాగ్‌ను డిజైన్ చేశారని, వ్యక్తులు లేదా ఇతరులకు చెందిన ఆస్తులను ట్రాక్ చేయడానికి కాదని టెక్ దిగ్గజం యాపిల్ పేర్కొంది.