ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాపై వివిధ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంత్జాతీయ పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలుమార్లు యూరప్ దేశాలను కోరారు. అలాగే రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలని అమెరికా, యూరప్ మిత్రదేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జర్మనీ ప్రభుత్వం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో రష్యా చొరబాటును అడ్డుకోవడానికి విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యుద్ధానికి మద్దతు ఇవ్వడంలో రష్యా సెంట్రల్ బ్యాంకు పాత్రను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధించారు.
వీటికి అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, బ్రిటన్, యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రష్యా కుబేరులు, వారి కుటుంబ సభ్యులకు ఉండే ‘‘గోల్డెన్ పాస్‌పోర్టులు’’ పనిచేయవు. అంతేకాదు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతునిచ్చే కొందరు వ్యక్తులు, సంస్థలను ఈ ఆంక్షలు టార్గెట్ చేయనున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడం ద్వారా యూరోపియన్ పీస్ ఆర్డర్‌కు రష్యా విఘాతం కలిగించిందని, ఈ యుద్ధాన్ని కనుక రష్యా ఆపకపోతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఈ దేశాలన్నీ అంగీకరించాయని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు.