Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి (Rawalpindi)లోని అదియాలా జైలు (Adiala Jail)లో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లు కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, నిఘా సంస్థ ఐఎస్ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసినట్లు బలూచిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.
అయితే ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఇస్లామాబాద్ (Islamabad), రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు.
రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల, ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల నిరసనలు చేపట్టేందుకు ఇమ్రాన్ మద్దతుదారులు రెడీ అయ్యారు. పీటీఐ పార్టీ నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రెండు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు నగరాల్లో సెక్షన్ 144 విధించారు. అంతేకాదు ప్రజా భద్రత దృష్ట్యా బుధవారం వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2022లో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయారు. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన ప్రభుత్వం ఆయనపై అవినీతి, ఉగ్రవాదం వంటి పలు కేసులే పెట్టింది. ఈ కేసులలో ఆయన 2023 ఆగస్టు నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అదియాలా జైలులో బందీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను గత కొన్ని నెలలుగా ఆయన కుటుంబ సభ్యులు సహా ఎవరూ చూడలేదు. అప్రకటిత ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన మిత్రులు, కుటుంబం, పార్టీ నాయకులు ఎవరూ కలవడానికి అనుమతించలేదు.
తమ సోదరుడి మరణంపై వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఇటీవలే అదియాలా జైలు వద్దకు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ పార్టీ కార్యకర్తలతో కలసి చేరుకున్నారు. జైలులో తమ సోదరుడిని కలుసుకోవడానికి అనుమతించని అధికారులు తమపై పోలీసు సిబ్బందితో దౌర్జన్యం చేయించారని, తమను జుట్టుపట్టుకుని ఈడ్చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అఫ్ఘాన్ టైమ్స్ పత్రిక ప్రచురించిన వార్తా కథనం పాకిస్థాన్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది.
అఫ్ఘానిస్థాన్ టైమ్స్ ప్రచురించిన వార్తలను గంటల వ్యవధిలోనే పాకిస్థానీ ప్రభుత్వ అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారంటూ ఈ ఏడాది మేలో ప్రచారం చేసిన తరహాలోనే ఇప్పుడు మళ్లీ మోసపూరితంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు పాక్ విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటనను సైతం జారీచేసింది. అయితే పాక్ సమాచార ప్రసార శాఖ తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అవి తప్పుడు వార్తలని ఖండించింది.
Also Read..
Amar Subramanya: యాపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌గా అమర్ సుబ్రమణ్య నియామకం
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం భేష్.. నార్మల్‌గా ఎంఆర్ఐ రిపోర్ట్
ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా రేజ్ బైట్