హైదరాబాద్ : నగరంలో అమానవీయ ఘటన చోటు చేసుకున్నది. నిలోఫర్ ఆసుపత్రి వద్ద ప్లాస్టిక్ కవర్లో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కవర్లో దాదాపు మూడు రోజుల వయసున్న బాబును ఆసుపత్రి ప్రాంగణంలో వదిలి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించి.. వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే, బాబు పసిరికలతో బాధపడుతుండగా.. అంగవైకల్యం ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడిని వదిలి వెళ్లిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.