Loans Interest Rates | దేశంలోకెల్లా రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం కీలక వడ్డీరేట్లు 0.15 శాతం పెంచేసింది. ఈ నెల మొదటి వారంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు పెంచడం ప్రాధాన్యం సంతరించుకున్నది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి మరో దఫా ఆర్బీఐ 35 బేసిక్ పాయింట్ల వరకు రెపోరేట్లు పెంచనున్నదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఫలితంగా ఐసీఐసీఐ బ్యాంకులో వివిధ రంగాల అన్ని టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెరిగింది. పెంచిన వడ్డీరేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా వాహన, ఇండ్ల, వ్యాపార, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదా చెల్లింపులు.. అంటే ఈఎంఐ పేమెంట్స్ భారంగా మారనున్నాయి. ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెరిగి 7.90 శాతానికి చేరుకుంటుంది. ఓవర్ నైట్ టెన్యూర్ లోన్‌పై ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా ఉంటుంది.
గత వారం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) వడ్డీరేట్లు 0.25 శాతం పెంచేసింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్) ఇండ్ల రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీరేట్లు 25 బేసిక్ పాయింట్లు పెంచివేసింది. కొత్త రుణ గ్రహీతలకు సోమవారం, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి శుక్రవారం (ఆగస్టు 5) నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని ఇండియా బుల్స్ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 10 బేసిక్ పాయింట్లు పెంచేసింది. సవరించిన ఎంసీఎల్ఆర్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఏడాది గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.55 నుంచి 7.65 శాతానికి పెరిగింది. నెల రోజుల గడువు గల రుణాలపై 7.05 ఎంసీఎల్ఆర్, మూడు నెలల టెన్యూర్ లోన్‌పై 7.15 శాతానికి చేరుకున్నది. ఆరు నెలల గడువు గల రుణాలపై 7.35, మూడేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి చేరింది. గత నెల ఒకటో తేదీన పీఎన్బీ ఎంసీఎల్ఆర్ 15 బేసిక్ పాయింట్లు పెంచింది. అయితే రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) యథాతథంగా 7.40 శాతం ఉంచుతూ నిర్ణయం తీసుకున్నది.