వయసు అనేది ఒక అంకె మాత్రమే అనేది మరోమారు నిరూపితమైంది. ప్రతిభ చాటేందుకు వయసుతో పనిలేదని తేటతెల్లమైంది. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని 59 ఏండ్ల నవ యువకుడు పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ నిరూపిస్తున్నారు. ఏడేండ్ల క్రితం మొదలైన అతని పవర్‌లిఫ్టింగ్ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. యువకులకు తాను ఏ మాత్రం తీసిపోనని నిరూపిస్తూ జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. కొండంత ఆత్మవిశ్వాసంతో పవర్‌లిఫ్టింగ్‌లో దూసుకెళుతున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వ్యాయమాన్ని తన జీవితంలో భాగం చేసుకున్న ప్రదీప్ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరు పదుల వయసులో..నవ యువకులకు దీటైన పోటీనిచ్చేందుకు సై అంటున్నారు. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి కాంతులు విరజిమ్మిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి ప్రదీప్‌తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ
పవర్‌లిఫ్టింగ్ ప్రస్థానం ఎలా?
మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. మేము ఐదుగురు సంతానం. మా తండ్రి పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశారు. ఆయన స్ఫూర్తితో జీవితంలో ముందడుగు వేశాను. చిన్నతనం నుంచే వ్యాయామం పట్ల మక్కువ చూపించాను. ఇంటర్మీడియట్, ఆ పై చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాను. అంబేద్కర్ కాలేజీలో విద్యనభ్యసిస్తూనే హనుమాన్ వ్యాయమశాల(రామ్‌కోటి)లో తర్ఫీదు పొందాను. అభిరుచిని ఆసక్తికరంగా మలుచుకుంటూ బాడీబిల్డర్‌గా ఎదగాలనుకున్నాను. అయితే 1987లో ట్రెజరరీ శాఖలో ఉద్యోగం వచ్చింది. దీంతో కొన్ని రోజుల పాటు వ్యాయమానికి దూరం కావాల్సి వచ్చింది. మహేశ్వరంలో తొలి అపాయింట్మెంట్ వచ్చింది. నా భార్య ప్రభుత్వ టీచర్. ఉద్యోగ నిమిత్తం ఎల్బీ నగర్లో సెటిల్ అయ్యాం. ఇక్కడకు వచ్చిన తర్వాత 2015లో మళ్లీ వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. మొదట్లో 90 కిలోల బరువు ఉండేవాన్ని. బరువు తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నం చేశాను. కోచ్ సహకారంతో తక్కువ సమయంలోనే ఏకంగా 22 కిలోల బరువు తగ్గాను. ఫిట్నెస్ పరంగా ఉన్నత స్థితికి చేరుకున్నాను. అదే కొనసాగించాలన్న పట్టుదలతో వ్యాయమాన్ని విడిచిపెట్టలేదు.
బాడీ బిల్డింగ్ వైపు అడుగులు ఎలా?
కర్మాన్‌ఘాట్‌లో జిమ్‌లో కోచ్‌లు వెంకట్, సమీర్ సహకారంతో అప్పటి వరకు లైట్‌వెయిట్ ప్రాక్టీస్ చేసిన నేను బాడీ బిల్డర్ కావాలన్న పట్టుదలతో హెవీ వెయిట్స్ ఎత్తడం మొదలుపెట్టాను. మంచి కసితో 100కిలోలకు పైగా బరువులు ఎత్తేవాన్ని. అయితే నేను ఏం చేసినా..వాట్సప్ స్టేటస్‌లో పెడుతుంటాను. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2018లో అసిస్టెంట్ ఆకౌంట్స్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చింది. నా స్టేటస్లు చూసిన ఒక అధికారి పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లమంటూ సలహా ఇచ్చారు. అలా బరిలోకి దిగిన తొలిసారే రాష్ట్ర స్థాయి టోర్నీలో పసిడి పతకం గెలిచాను. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆల్ఇండియా చాంపియన్‌షిప్‌లో ఏడు కిలోల తేడాతో నాలుగో స్థానంలో నిలిచాను. దీనిపై ఒకింత నిరాశ చెందాను. లోపాలపై దృష్టిపెడుతూ మళ్లీ రాష్ట్ర స్థాయిలో టోర్నీలో స్వర్ణం గెలిచాను.
ఆల్ఇండియా టోర్నీలో స్వర్ణంపై స్పందన?
చెన్నై వేదికగా ఈనెల 14 నుంచి 18 వరకు జరిగిన ఆల్ఇండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించడం ఎప్పటికీ మరిచిపోను. పవర్‌లిఫ్టింగ్ జాతీయ కోచ్ చంద్రశేఖర్ మార్గదర్శకత్వంలో మరింత రాటుదేలాను. తప్పులను సరిదిద్దుకుంటూ ముందంజ వేశాను. చెన్నై టోర్నీలో ప్రత్యర్థులకు ఊహించని రీతిలో పోటీ ఇస్తూ డెడ్‌లిఫ్ట్‌లో 160కిలోలు, స్వాట్స్లో 140 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 80 కిలోలు మొత్తంగా 380 కిలోలు ఎత్తి టాప్‌లో నిలిచాను. నేను ఎత్తిన బరువు చూసి కోచ్‌లు చాలా సంతోష పడ్డారు. ప్రత్యర్థి లిఫ్టర్లు ఎవరూ దరిదాపుల్లో లేకపోవడం నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అయ్యింది.
59 ఏండ్ల వయసులో పవర్‌లిఫ్టింగ్‌పై?
అభిరుచికి వయసుతో సంబంధం లేదు. గత ఏడేండ్లలో ఏ ఒక్క రోజు నేను వ్యాయమాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్లినా..అక్కడ కచ్చితంగా వ్యాయామం చేస్తాను. వర్క్ఔట్స్ నా జీవితంలో భాగమైంది. ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాను. రోజూ ఉదయం ఐదు గంటలకు లేచి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు జిమ్‌లో వ్యాయామం చేస్తాను. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాను. 2015 నుంచి అన్నం తినడం మానేశాను. గోధుమలు, ఎగ్‌వైట్, డ్రైఫ్రూట్స్, ఫ్రూట్స్ తింటూ ఆరోగ్యంగా ఉంటున్నాను.
కుటుంబ నేపథ్యం?
నా భార్య మైలార్దేవి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నది. మాకు ఇద్దరు పిల్లలు. కూతురు, అల్లుడు ఇద్దరూ డెంటిస్టులు. కూకట్‌పల్లిలో క్లినిక్ ఉంది. కొడుకు, కోడలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. కుటుంబంలో అందరూ మంచి స్థాయిల్లో ఉన్నారు.
యువకులకు మీరిచ్చే సలహా?
పవర్‌లిఫ్టింగ్ ను కెరీర్‌గా ఎంచుకోవాలనే యువకులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలి. ఏదో మొక్కుబడిగా కాకుండా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తే అనుకున్నది సాధించవచ్చు. విజయానికి ఎప్పుడు దగ్గర దారులు ఉండవు. కష్టపడితేనే ఏదైనా దక్కేది. డైట్ విషయంలో ఖర్చు అవుతున్నా..వెనుకకు తగ్గకుండా కొనసాగిస్తున్నాను. నా కెరీర్‌కు ప్రభుత్వంతో పాటు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ నుంచి మంచి మద్దతు ఉంది.