కోజికోడ్: ఇటీవల ఓ లైంగిక వేధింపుల కేసులో కేరళ సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కోజికోడ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ కృష్ణకుమార్ ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. అయితే అమ్మాయి రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నట్లు ఆ తీర్పులో ఆ జడ్జి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక చంద్రన్కు సంబంధించిన మరో కేసులోనూ అదే న్యాయమూర్తి ఓ వివాదాస్పద కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వేధింపుల కేసులో ఆ మహిళ కులం గురించి జడ్జి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుల వివక్ష గురించి చంద్రన్ పోరాటం చేస్తున్నారని, అయితే ఆ మహిళ ఎస్సీ అని తెలిసి కూడా ఆమెను టచ్ చేస్తాడని నమ్మడం లేదని జడ్జి ఆ తీర్పులో అభిప్రాయపడ్డారు. కులం పేరును తీర్పుకు చెందిన బుక్లో ప్రస్తావించలేదని తెలుస్తోంది. నిందితుడు చంద్రన్ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని, అలాంటప్పుడు ఆ వ్యక్తి ఓ మహిళ దళిత్ అని తెలిసి ఆమెను ఎలా ముట్టుకుండాని తీర్పులో జడ్జి పేర్కొన్నారు.
చంద్రన్పై రెండు వేధింపుల కేసులు ఉన్నాయి. ఏప్రిల్లో జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో తనను వేధించినట్లు ఓ దళిత రైటర్ ఆరోపించింది. మరో యువ రైటర్ కూడా ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జిషన్ సమయంలో వేధించినట్లు చంద్రన్పై ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ చంద్రన్ తరుపున వాదించిన లాయర్లు ఆరోపణల్ని ఖండించారు.