హైదరాబాద్, ఆట ప్రతినిధి : రెండు నెలల విరామం తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో భాగంగా ఈ బరోడా ఆటగాడు.. బంతితో నిరాశపరిచినా బ్యాట్ (42 బంతుల్లో 77*, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో అదరగొట్టాడు. హార్ధిక్ మెరుపులతో జింఖానా గ్రౌండ్స్ లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల భారీ ఛేదనను 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
స్మాట్‌లో హైదరాబాద్ జోరు కొనసాగిస్తున్నది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు.. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచింది. యూపీని 127 పరుగులకే కట్టడిచేసిన హైదరాబాద్.. 17.1 ఓవర్లలోనే ఛేదనను పూర్తిచేసి ఆడిన 4 మ్యాచ్‌లలో మూడో విజయాన్ని నమోదుచేసింది.