సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్ నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో సచివాలయం, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఉన్న 2.3 కి.మీ దూరాన్ని ఎంపిక చేసి పనులు నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఫార్ములా ఈ రేసింగ్‌ను 2023 ఫిబ్రవరి 23న నగరంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీజన్ 9కి సంబంధించిన షెడ్యూలును ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్స్‌ను నవంబర్, డిసెంబర్లో నిర్వహించనున్నారు. రౌండ్ 3లో భాగంగా నవంబర్ 19 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో ట్రయన్ రన్‌ను నిర్వహిస్తారు. ట్రాక్ నిర్మాణం పనులను, పోటీల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు కమిటీలను నియమించగా, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను ఆయా కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..
ముందుగా నిర్ణయించిన 2.3 కి.మీ ట్రాక్‌లో ఎలక్ట్రిక్ కార్లు 280 కి.మీ వేగంతో పరుగులు పెడతాయి. దీనికి అనుగుణంగానే ట్రాక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. మొత్తం ట్రాక్‌ను 3 సెక్టార్స్‌గా విభజించారు. దీనిపై 8 చోట్ల రేసింగ్‌లో పాల్గొన్న కార్లు మలుపులు తీసుకొని గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రాక్ ఉన్న మార్గంలో మొత్తం 28 చోట్ల మార్షల్ పొజిషన్స్, ఫైర్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ఫార్ములా -ఈ కార్ల రేసింగ్ తెలంగాణ సచివాలయం ఎదురుగా (లుంబిని పార్కు ఉత్తరం వైపు) ప్రారంభమై, తిరిగి అదే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. సీజన్ 9కి సంబంధించిన ఈ రేసింగ్ పోటీలను 2023 ఫిబ్రవరి 23న నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ, షెడ్యూల్డు ప్రకారం నిర్ణయించిన మార్గంలో ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు.
ఫార్ములావన్ రేసింగ్ కారు ఆవిష్కరణ
ఫార్ములా – ఈ కార్ రేసింగ్ ప్రమోషన్ కార్యక్రమం జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని ఫ్రోస్ట్ పబ్ వద్ద శనివారం కన్నులపండువగా నిర్వహించారు. ‘ది గ్రేటర్ ఫార్ములావన్ కార్ రేసింగ్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పోటీ ల్లో పాల్గొననున్న ఫార్ములా రేసింగ్ కార్‌ను సినీనటి నివేదా పేతురాజ్ ఆవిష్కరించారు. తొలిసారిగా హైదరాబాద్ నగరం ఫార్ములా కార్ రేసింగ్‌లకు వేదిక కావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.