ఔరా..హైదరాబాదేనా !
ఐటీ కారిడార్‌తో హైదరాబాద్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆకాశమే హద్దుగా నిర్మించిన భవనాలన్నీ అద్దాలమేడలే. పగలు ఒక రకంగా..రాత్రిళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో కనువిందు చేస్తున్నాయి. చాలాకాలం తర్వాత ఇటువైపు వచ్చిన వారు.. ఇది హైదరాబాదేనా..అని ఆశ్చర్యపోతున్నారు.
చారిత్రక భాగ్యనగరిలో సరికొత్త ఐటీ నగరి జతచేరడంతో హైదరాబాద్ కీర్తి ఎల్లలు దాటుతోంది. ఐటీలో మేటిగా సాగుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ నగరంలో కొలువుదీరాయి. డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలతోపాటు ఐటీయేతర సంస్థలు ఐటీ కారిడార్‌లో నెలకొల్పడంతో ఈ ప్రాంతంలో ఆకాశహర్మ్యాలు వెలిశాయి. ఒకదానికొకటి పోలికలేకుండా దేశ, విదేశీ ర్కిటెక్చర్ల డిజైన్లతో నిర్మించిన అద్దాల మేడలు ఔరా అనేలా చేస్తున్నాయి. మాదాపూర్ సైబర్టవర్స్ మొదలు గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, కోకాపేట వరకు దాదాపు 100 పైగానే ఐకానిక్ బిల్డింగ్లు, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క కోకాపేట, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో 45 నుంచి 58 అంతస్థుల భవనాలు సుమారు 10 వరకున్నాయి. జాతీయ,అంతర్జాతీయ కంపెనీలకు తగినట్లే ఆతిథ్యమిచ్చేందుకు పేరొందిన స్టార్ హోటళ్లు ఇక్కడ వెలిశాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంటే చారిత్రక నగరమే కాదు..ఐటీలోనూ మేటి. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఐటీ దిగ్గజ సంస్థలు నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. యేటికియేడు తమ ఐటీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అత్యంత ఆధునికతతో ఆకాశమే హద్దుగా వెలుస్తున్న ఐటీ భవనాలు నగరానికి సరికొత్త అందాలు తెస్తున్నాయి. ఒకదానిమించి మరోటి నిర్మిస్తూ ఔరా అనిపిస్తున్నాయి. ఎత్తయిన అద్దాల భవనాలు, విశాలమైన ప్రాంగణాలు, పచ్చదనంతో ఐటీ కారిడార్ అబ్బురపరుస్తోంది.
స్కైవ్యూ, గెలాక్సీ, సాస్క్రౌన్, అమెజాన్, ఫీనిక్స్ బీ హబ్, ల్యాంకోహిల్స్…ఇలా పదుల సంఖ్యలో భవనాలు నగరానికి ఐకానిక్‌గా మారాయి. ఐటీ సంస్థల భవనాలే కాదు, పేరొందిన మాల్స్, మల్టీప్లెక్సులు, నివాస భవనాలు కలగలిసి ఉండడంతో విదేశాల్లో ఉన్నామా..! అన్న అనుభూతి కలుగుతుంది. ఎత్తయిన భవనాల నిర్మాణం చేపట్టడంతోపాటు వాటి ఆకృతి(ఆర్కిటెక్చర్) అత్యద్భుతంగా దేశ,విదేశాల్లో పేరొందిన ఆర్కిటెక్టులతో డిజైన్లను రూపొందించి నిర్మాణాలు చేపడుతున్నారు. 12, 20 అంతస్థులతో మొదలైన ఐటీ కార్యాలయాల భవనాలు ఇపుడు 58 అంతస్థులకు చేరడం విశేషం. కోకాపేట, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో 45 నుంచి 58 అంతస్థుల భవనాలు సుమారు 10 వరకున్నాయి.
ఆఫీసులకు తగినట్లే స్టార్ హోటళ్లు
మాదాపూర్ హైటెక్‌సిటీ నుంచి ప్రారంభమైన ఐటీరంగ ప్రస్థానం ఇప్పుడు కొండాపూర్, రాయదుర్గం, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, కొల్లూరు వైపు విస్తరిస్తూనే ఉంది. కార్యాలయాలకు తగినట్లు పెద్దపెద్ద స్టార్ హోటళ్లూ వెలుస్తున్నాయి. నోవాటెల్, హెచ్ఐసీసీ, హైటెక్, వెస్టిన్, ట్రైడెంట్, షెరటన్, ర్యాడిసన్, లెమన్‌ట్రీ, ఐటీసీ కోహినూర్, హయత్ గచ్చిబౌలి, మారియెట్..ఇలా పలు స్టార్‌హోటళ్ల భవనాలు కూడా ఆధునికతను కలబోసుకొని ఆతిథ్యమిస్తున్నాయి. దేశ,విదేశాల నుంచి వచ్చేవారికి ఈ హోటళ్లు ఆధునిక విందు,వినోద కేంద్రాలుగా మారాయి. దుర్గం చెరువు సమీపంలోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న స్టార్ హోటల్ ఐటీసీ కోహినూర్ ఆకారమే వినూత్నం.
రాత్రివేళల్లో కళ్లు చెదిరేలా..
ఆకాశమే హద్దుగా నిర్మించిన భవనాలన్నీ అద్దాలమేడలే. పగలు చూస్తే ఒక రకంగా..రాత్రివేళల్లో మరో రకంగా కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఐటీ కారిడార్‌ను తిలకించేందుకు కొందరు తమ పిల్లలతో కలిసివస్తున్నారు. మాదాపూర్ సైబర్టవర్స్ నుంచి మొదలుకొని రాయదుర్గం మీదుగా గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, మణికొండ, కోకాపేట వరకు దాదాపు 100 పైగానే ఐకానిక్ బిల్డింగ్లు, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన పశ్చిమ నగరానికి మరో మణిహారంగా మారింది. ఈ వంతెన సినిమా, టెలిసీరియళ్ల షూటింగ్‌లకు హాట్‌స్పాట్‌గా మారింది. పగలు,రాత్రి వేళల్లో ఈ వంతెనను చూసేందుకు సందర్శకులు
భారీగా తరలివస్తున్నారు.
ఆధునిక వసతులు, చక్కటి రవాణా
ఐటీ కారిడార్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకురోడ్లతో రవాణా సులభతరమైంది. ఉద్యోగులు సులువుగా ప్రయాణించేందుకు విశాలమైన రహదారులు నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలు కార్పొరేట్ కార్యాలయాలకు ఎంతో అనుకూలంగా మారాయి. కారిడార్‌లో మాదాపూర్ తర్వాత రెండో స్థానంలో గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగురోడ్డు ప్రారంభం కావడంతో రోడ్డు రవాణా సౌకర్యం అత్యంత అనుకూలంగా మారింది. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దూరం 24 కి.మీ. కేవలం 30 నిమిషాల వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఇదే ఐటీ కారిడార్‌కు అత్యంత అనుకూలం. రాయదుర్గం, నానక్‌రాంగూడ, కోకాపేట, కొండాపూర్ ప్రాంతాలన్నీ ఔటర్‌కు సమీపంలోనే ఉన్నాయి. ఫలితంగా వ్యాపార సంస్థలు తమకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఐటీ కారిడార్‌నే ఎంచుకొని తమ కార్యాకలపాలు సాగిస్తున్నాయి.
ఐటీ కారిడార్‌లో ఐకానిక్ భవనాలు