సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రంగం ఏదైనా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి పెంచుకుంటున్నది. ప్రతి రంగంలోనూ ఒక్కో మెట్టును ఎగబాకుతూ ముందడుగు వేస్తున్నది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్ రంగాల్లోనే కాదు తాజాగా సరుకు రవాణా(లాజిస్టిక్) రంగంలోనూ హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోటీ పడుతున్నది. 2022 వార్షిక సంవత్సరంలో 128శాతం వృద్ధి రేటులో దేశంలోని 8 మెట్రో నగరాల్లో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న పుణె 166 శాతం వృద్ధి రేటు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఈ రెండు నగరాలే ఇతర నగరాలతో పోల్చితే చాలా గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేశాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా ‘ఇండియా వేర్ హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్-2022’ నివేదికను బుధవారం వెల్లడించింది. వృద్ధి రేటు ఎక్కువగా నమోదు కావడంలో థర్డ్ పార్టీ లాజిస్టిక్ విభాగం మొదటి స్థానంలో ఉండగా, ఈ -కామర్స్ , రిటైల్ కంపెనీలు ఎక్కువ మొత్తంలో సరుకుల రవాణా కోసం గిడ్డంగులను వినియోగించుకుంటున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా వేర్ హౌసింగ్ లీజింగ్ సామర్థ్యం ఏటా పెరుగుతూనే ఉన్నదని, విదేశీ పెట్టుబడులు సైతం పెద్ద మొత్తంలో వస్తున్నాయని బైజాల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 2021లో మొత్తం 1.3 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు రాగా, 2022లో హెచ్-1లోనే మొత్తం 1.2 బిలియన్ల యూఎస్ డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు సైతం ఈ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తుండటంతో మరింత వృద్ధి రేటుకు అవకాశం ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తుండగా, అందులో హైదరాబాద్ నగరంలోనూ ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరింతగా వేర్ హౌసింగ్ జోన్లు విస్తరించేందుకు అవకాశం ఉందని వివరించారు.
మేడ్చల్ : 50 శాతం
శంషాబాద్ : 41 శాతం
పటాన్చెరు : 8 శాతం
సంవత్సరం లీజింగ్ సామర్థ్యం (మి.చ.అ)
2018 2.29
2019 4.01
2020 3.40
2021 2.37
2022 5.42
2022 2021
3పీఎల్ 26 24
ఈ కామర్స్ 38 54
రిటైల్ 14 –
ఎఫ్ఎంసీజీ 4 20
ఎఫ్ఎంసీడీ 1 –
ఇతర విభాగాలు 17 2