ఒకే ఒక్కడు.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కమిషనరేట్ల పోలీసులను పరుగులు పెట్టించాడు. ఒక్కరోజులోనే నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి 19 తులాల బంగారు గొలుసులను తస్కరించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఉదయం 11:30 గంటలకు కుత్బుల్లాపూర్‌లో మొదలైన స్నాచింగ్‌ల పర్వం సాయంత్రం 5గంటల వరకు(మేడిపల్లి) కొనసాగుతూనే ఉన్నది. అప్రమత్తమైన పోలీసు అధికారులు హుటాహుటిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ)/కుత్బుల్లాపూర్/మేడిపల్లి/అడ్డగుట్ట, జనవరి 19 : కుత్బుల్లాపూర్ సర్కిల్ పేట్‌బషీరాబాద్ పోలీస్ పరిధిలో బుధవారం ఉదయం 11:30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి మొదటగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. తర్వాత మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీల పర్వం కొనసాగించాడు. అయితే అంతటా చేతి వాటం ప్రదర్శించింది ఒక్కడేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే నిందితుడు ముఖానికి మాస్కు, జాకెట్ ధరించి, క్యాప్‌తో యాక్టీవా వాహనంపై సంచరించాడని తేలింది. ఈ వాహనం కూడా ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలోని ఓ ఇంటి దగ్గర నుంచి దొంగిలించాడని స్పష్టమైంది. ఈ వరుస చైన్ స్నాచింగ్‌లతో అప్రమత్తమైన పోలీసు అధికారులు హుటాహుటిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కొరవడిన సమన్వయం..
స్నాచర్‌ను పట్టుకోవడంలో ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన దుండగుడి ఫొటోను సీసీ కెమెరాల ద్వారా నిమిషాల్లో సేకరించుకున్నా.. అతడి ఫొటోను మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరికీ షేర్ చేయకుండా.. ఎవరికి వారే తామే పట్టుకోవాలనే ఆశతో సమన్వయాన్ని మరిచారని విమర్శలు వినవస్తున్నాయి. ఒకసారి ఫొటో దొరకగానే ఫీల్డ్‌లో ఉండే పెట్రోలింగ్, ఇతర సిబ్బందికి వాట్సాప్‌తో పాటు ఇతర సాంకేతిక పరంగా షేర్ చేసుకుని ఉంటే స్నాచర్ ప్రయాణించిన 20 కిలో మీటర్ల దూరంలో దొరికిపోయేవాడు. కాని అలా జరగకపోవడంతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సాఫీగా తిరుగుతూ పంజా విసిరాడు.
ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
స్నాచర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే దుండగుడు బయటి రాష్ట్రం నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు నగరానికి చెందిన పాత స్నాచర్ అయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన వాహనం టీఎస్ 13ఈయూ 2844 లేదా 2044గా పోలీసులు అనుమానిస్తున్నారు.
చైన్ స్నాచింగ్ ఘటనల వివరాలు..